
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయంటే అందులో రైల్వే ట్రాక్‌పైనా ఆందోళనలు తప్పక జరుగుతాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఆందోళనలు జరిగితే.. రైల్వేలపై ప్రభావం పడుతూనే ఉన్నది. అవి హింసాత్మకంగా మారితే రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తుండటాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ సారి అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా బిహార్ నుంచి తెలంగాణ వరకు హింసాత్మక ఆందోళనలు జరిగాయి. వాటికి రైల్వే శాఖ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నిరసనకారులు రైల్వే కోచ్‌లకు నిప్పు పెట్టారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో రైల్వే శాఖ ఈ దశాబ్దంలో అత్యధికంగా నష్టపోయింది. ఈ నిరసనల కారణంగా గత కొన్ని రోజుల్లోనే రూ. 1000 కోట్లను నష్టపోయినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో రైల్వే కోచ్‌లకు నిప్పు పెట్టినందున, రైల్వే స్టేషన్లు, ఇతర ఆస్తులను ధ్వంసం కావడంతోపాటు.. ఈ విధ్వంసం కారణంగా రైళ్లు రద్దు కావడం మూలంగా ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వడం అన్ని కలిపి ఈ నష్టాన్ని గణించింది.
ఆందోళనకారులు పది పన్నెండు రైళ్లకు నిప్పు పెట్టారు. రైల్వే శాఖ ఆస్తులను ధ్వంసం చేశారు. అగ్నిపథ్ నిరసనల కారణంగా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 700 కోట్లు నష్టపోయినట్టు జూన్ 18న రైల్వే శాఖ వెల్లడించింది. అంతేకాదు, సుమారు 60 కోట్ల ప్రయాణికుల టికెట్లు రద్దు చేయాల్సి వచ్చిందని వివరించింది.
ఈ దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో ఆస్తుల విధ్వంసాన్ని రైల్వే శాఖ చూడలేదు. ఈ దశాబ్దం మొత్తంలో జరిగిన నష్టం కంటే కూడా అగ్నిపథ్ స్కీం నిరసనల కారణంగా ఎక్కవ నష్టాన్ని రైల్వే శాఖ వెల్లడించింది.
అధికారుల ప్రకారం, ఒక్క జనరల్ కోచ్ తయారీకి రూ. 80 లక్షలు, స్లీపర్ కోచ్‌కు రూ. 1.25 కోట్లు, ఏసీ కోచ్‌కు రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తున్నది. ఒక రైల్ ఇంజిన్‌ను తయారు చేయడానికి ప్రభుత్వం రూ. 20 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
రైల్వే చట్టాల ప్రకారం, రైల్వే శాఖ ఆస్తులను ధ్వంసం చేయడం నేరపూరిత చర్య. రైల్వే యాక్ట్ 1989లోని సెక్షన్ 151 ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా రైల్వే ఆస్తులను ఏ రూపంలోనైనా నష్టపరిస్తే వారికి గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా విధించవచ్చు.