నేను చెప్పిన పాటే వేయాలి.. పెళ్లి వేడుకలో పాట కోసం షూట్ చేసి చంపేశాడు.. ఎక్కడంటే?

By Mahesh KFirst Published Feb 7, 2023, 2:23 PM IST
Highlights

బిహార్‌లో ఓ పెళ్లి వేడుకలో నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో తీవ్ర ఘర్షణ జరిగింది. తమకు నచ్చిన పాటే వేయాలని కొందరు డిమాండ్ చేస్తే.. ఇంకొందరు వారి తీరును తప్పు పట్టారు. ఈ క్రమంలోనే జరిగిన గొడవలో ఓ వ్యక్తి తుపాకీ తీసి షూట్ చేసి కాల్చేశాడు. ఈ షూట్‌లో ఓ వ్యక్తి స్పాట్‌లోనే మరణించారు.
 

పాట్నా: పెళ్లి అన్నప్పుడు ఆటా పాటా కచ్చితంగా ఉంటుంది. అంతేనా.. పాటలకు డ్యాన్సులు కూడా ఉంటాయి. ఈ డ్యాన్సులకు ఒక వేదిక.. ఆ వేదిక పై డ్యాన్స్ చేయడానికి ఎవరికి ఇష్టమైన పాట వారు వేయించుకుని చేస్తుంటారు. ఇలా తమకు ఇష్టమైన పాట కోసం డిమాండ్ చేయడం దాదాపు ప్రతి పెళ్లిలో చూస్తూనే ఉంటాం. అయితే, కొంత ముందూ వెనుకగా ఆ పాట వస్తుంది. కానీ, బిహార్‌లో ఓ వ్యక్తి తన పాట వచ్చే వరకు ఆగలేదు. గొడవకు దిగాడు. ఈ గొడవలోనే ఓ వ్యక్తిని షూట్ చేసి చంపేశాడు.

బిహార్‌లోని అర్రా జిల్లాలో ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలోనే సోమవారం ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో తమకు నచ్చిన పాట వేయడంపై జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తుపాకీ తీసి షూట్ చేయగా.. 23 ఏళ్ల అభిషేక్ కుమార్ సింగ్ అలియాస్ భాస్కర్ మరణించాడు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేసేవాడు. అతని బాడీపై ఎడమ కంటి దగ్గర బుల్లెట్ గాయాలు కనిపించాయి.

Also Read: హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణం.. నియామకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం

పెళ్లి వేడుకలో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ కార్యక్రమానికి సమీపంలోని కొన్ని గ్రామాల నుంచి కొందరు దుండగులు వచ్చారు. వాళ్లు వేదిక పైకి వెళ్లి తమకు కావాల్సిన పాటనే వేయాలని డిమాండ్ చేశారు. వీరి తీరును జూనియర్ ఇంజినీర్ అభిషేక్, వారి కుటుంబం అంగీకరించలేదు. వెంటనే వారు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగింది. ఈ గొడవల్లోనే ఓ దుండగుడు తుపాకీ తీసి అభిషేక్‌ను షూట్ చేశాడు. అతను స్పాట్‌లోనే మరణించాడు.

ఈ ఘటన గురించి విషయం తెలియగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. అభిషేక్ కుమార్ సింగ్ డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం అర్రాలోని సదర్ హాస్పిటల్‌కు తరలించారు.

click me!