శ్రీలంక తరహాలోనే భారత్ కనిపిస్తున్నది.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

By Mahesh KFirst Published May 18, 2022, 7:26 PM IST
Highlights

రాహుల్ గాంధీ కేంద్రం ప్రభుత్వంపై తాజాగా విమర్శలు సంధించారు. నిరుద్యోగం, చమురు ధరలు, మత ఘర్షణల్లో భారత్ కూడా సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక తరహాలోనే ఉన్నదని ఆయన గ్రాఫ్ చిత్రాలను జోడించి ఓ ట్వీట్ చేశారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. భారత్ అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నదని, కొన్ని కీలక విషయాల్లో మొత్తంగా శ్రీలంక తరహా కనిపిస్తున్నదని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా నిరుద్యోగం, చమురు ధరలు, మత ఘర్షణల వంటి విషయంలో ఈ రెండు దేశాల పరిస్థితులు ఒకే విధంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజల దృష్టి మరల్చినంత మాత్రానా వాస్తవాలు మారబోవని ఆయన తెలిపారు. ఇండియా చాలా వరకు శ్రీలంక లాగే కనిపిస్తున్నదని వివరించారు. ఈ విషయాన్ని ఆయన మొత్తం ఆరు గ్రాఫ్ చిత్ర పటాలతో వివరించే ప్రయత్నం చేశారు. నిరుద్యోగం, చమురు ధరలు, మత ఘర్షణల్లో ఈ రెండు దేశాల పరిస్థితులను గ్రాఫ్ చిత్రాలతో పోల్చారు. ఈ మూడు అంశాల్లో భారత్, శ్రీలంక గ్రాఫ్ పటాలు ఒకే తీరులో ఉన్నాయి.

2017 నుంచి ఈ రెండు దేశాల్లో నిరుద్యోగం పెరుగుతూనే ఉన్నది. 2020లో పరాకాష్టకు చేరింది. లాక్‌డౌన్ ఈ ఏడాదిలోనే విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాతి ఏడాది నిరుద్యోగ తీవ్రత కొంత తగ్గినట్టు గ్రాఫ్ పేర్కొంది. కాగా, చమురు ధరలు ఈ రెండు దేశాల్లో 2017 నంచి 2021 వరకు పెరుగుతూనే వచ్చాయి. మత ఘర్షణలూ 2020- 21లోనూ ఈ రెండు దేశాల్లో తీవ్రంగానే ఉన్నాయి.

Distracting people won’t change the facts. India looks a lot like Sri Lanka. pic.twitter.com/q1dptUyZvM

— Rahul Gandhi (@RahulGandhi)

శ్రీలంకలో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు ధరలు ఆకాశాన్ని అంటి, విద్యుత్, ఇతర సేవలు గగనమైపోయాయి. చమురు సహా ఇతర సరుకులను దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక దగ్గర విదేశీ మారక నిల్వలూ లేకపోవడంతో సంక్షోభం ముదిరింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు రేగాయి.

click me!