
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri ) ఘటనను ప్రణాళికబద్దమైన కుట్రగా (planned conspiracy) ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పాటుగా ప్రతిపక్షాలు బీజేపీ విమర్శల దాడిని పెంచాయి. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో.. అతడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ మరోసారి క్షమాపణలు చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై లోక్‌సభలో బుధవారం విపక్షాలు ఆందోళకు దిగాయి. సభలో సిట్ నివేదికపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
కాంగ్రెస్ నేతRahul Gandhi.. లఖింపూర్ ఘటపై సిట్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలంటూ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను.. ప్రధాని మోదీ మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘లఖింపూర్‌లో రైతుల ఊచకోత ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని, నిర్లక్ష్యపు చర్య కాదని యూపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ తన నివేదిక హైలైట్ చేసింది. ప్రభుత్వం వెంటనే హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను తొలగించి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి’ అని రాహుల్ గాంధీ తన నోటీసులో పేర్కొన్నారు.
అయితే రాహుల్ గాంధీ వాయిదా తీర్మానంపై లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ చర్చకు అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు చేపట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. అయితే వారి ఆందోళనల నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఎంత చెప్పిన విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్.. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
ఇక, లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక విషయాలను వెల్లడించింది. ఈ కేసులో 13 మంది నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307తో (attempt to murder) సహా కొత్త సెక్షన్‌లను జోడించాలని ఆ ప్రాంత చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు దరఖాస్తును దాఖలు చేసింది.
సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్న విద్యారామ్ దివాకర్ ఈ దరఖాస్తును డిసెంబర్ 9వ తేదీన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారు. నిందితులపై ఉన్న ఐపీసీలోని 279, 338, 304A సెక్షన్‌ల స్థానంలో కొత్త సెక్షన్లను వారెంట్‌లో చేర్చేందుకు అనుమతించాలని కోరారు. అక్టోబర్ 3వ తేదీన లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటన పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగా జరిగిందని.. నిర్లక్ష్యంతో కాదని తెలిపారు.