
బెంగళూరు: కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. లండన్ గడ్డపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవదీశారని, ఇది దురదృష్టకరం అని అన్నారు. భారత ప్రజాస్వామ్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బసవేశ్వరుడిపై దాడి, కర్ణాటక ప్రజలు, 130 కోట్ల భారత ప్రజలపై దాడి అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు ఇలాంటి వారిని దూరంగా ఉంచాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో పలు అభివృద్ధికర ప్రాజెక్టుల శంకుస్థాపనకు వెళ్లిన ప్రధానమంత్రి ధార్వాడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
‘మొత్తం ప్రపంచమంతా భారత ప్రజాస్వామిక వ్యవస్థను అధ్యయనం చేస్తున్నది. ఇంకా మరెన్నో విషయాల కారణంగా భారత్‌ను కేవలం అతిపెద్ద ప్రజాస్వామ్యమనే కాదు.. ప్రజాస్వామ్యానికి తల్లి అని అంటున్నాం. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తి ఏదీ లేదు. అయినా.. కొందరు భారత ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తూనే ఉన్నారు’ అని ప్రధాని మోడీ అన్నారు.
Also Read: చీట్ చేస్తున్నాడని బాయ్ ఫ్రెండ్ పై సల సల కాగే నూనె పోసిన యువతి.. అసలేం జరిగిందంటే?
రాహుల్ గాంధీ చదువుకున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యం పునాదులపై దాడి జరుగుతున్నదని, తాను సహా అనేక మంది రాజకీయ నేతలపై నిఘా ఉన్నదని ఆరోపణలు చేశారు. యూకే రాజధాని లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేంద్రంగా తాజాగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం నడించింది.
విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించాడని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను రాహుల్ గాందీ తోసిపుచ్చారు. తాను భారత్‌ను అవమానించలేదని, అలా చేయబోను అని అన్నారు. విదేశాల పై భారత్‌ను అవమానించింది కచ్చితంగా నరేంద్ర మోడీనే అని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమమూ జరగలేదని, దేశమంతా అవినీతిలో కూరుకుపోయిందని ఆయనే చాలా సార్లు పరువు తీసే ప్రయత్నాలు చేశాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయనే భారత దేశ ప్రతిష్టను వీలు చిక్కినప్పుడల్లా విదేశాల్లో మసకబార్చే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.