మరో అంతర్జాతీయ కూటమి సమావేశానికి భారత్ సిద్ధం అవుతున్నది. జీ 20 శిఖరాగ్ర సమావేశాలను భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. వచ్చే ఏడాది తొలినాళ్లలో క్వాడ్ సదస్సును కూడా భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: భారత దేశం మరో అంతర్జాతీయ గ్రూపునకు అధ్యక్షత వహించే అవకాశాలు ఉన్నాయి. జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు ఈ నెల 9వ, 10వ తేదీల్లో భారత్ విజయవంతంగా అధ్యక్షత వహించింది. ఇప్పుడు భారత్ మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతున్నది. క్వాడ్ సదస్సును కూడా భారత్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.రష్యా, చైనాలు కూడా భారత్ పై ప్రశంసలు కురిపించాయి. ఈ దేశాల ప్రశంసలు పొందినప్పటికీ ఈ రెండు దేశాలూ వ్యతిరేకించే క్వాడ్ సదస్సు నిర్వహణకు మన దేశం ఏమీ వెనుకడుగు వేయడం లేదని సమాచారం.
ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడానికి ఈ కూటమి ఏర్పడిందని రష్యా ఆరోపించింది. చైనా కూడా క్వాడ్ కూటమిపై గుర్రుగా ఉన్నది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలతో ఈ కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే.
2024 తొలినాళ్లలో క్వాడ్ సదస్సును నిర్వహించడానికి మోడీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ఇందుకోసం వచ్చిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది. అయితే. స్పష్టమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు.
Also Read: బిహార్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్ పిల్లలను మోసుకెళ్లుతున్న పడవ మునక, 12 మంది గల్లంతు
మే 20వ తేదీన జపాన్‌లోని హిరోషిమాలో జీ7 సదస్సుకు భారత ప్రధాని హాజరైనప్పుడే క్వాడ్ సదస్సును భారత్‌లోనే నిర్వహించాలనే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా తీసుకువచ్చారు. దీంతో జీ 20 సదస్సుకు హాజరైన జో బైడెన్, కిషిదా, ఆల్బనీస్‌లను భారత్‌లోనే ప్రధాని మోడీ మరోసారి కలవనున్నారు.
అదే విధంగా వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఈ ముగ్గురినీ ఆహ్వానించాలనే ఆలోచనలూ ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం.