పంజాబ్ లో పోలీసుల అరాచకం...మహిళను జీప్ పై కట్టేసి వికృతకాండ

By Nagaraju TFirst Published Sep 26, 2018, 6:37 PM IST
Highlights

పంజాబ్‌లో పోలీసుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు..తమ అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేసు విచారణ కోసం తన భర్తను స్టేషన్ కు తీసుకెళ్లొద్దంటూ ఓ మహిళ అడ్డుకోవడంతో ఆ మహిళపై రాక్షసంగా ప్రవర్తించారు పంజాబ్ క్రైం బ్రాంచ్ పోలీసులు. 

అమృత్‌సర్: పంజాబ్‌లో పోలీసుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు..తమ అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేసు విచారణ కోసం తన భర్తను స్టేషన్ కు తీసుకెళ్లొద్దంటూ ఓ మహిళ అడ్డుకోవడంతో ఆ మహిళపై రాక్షసంగా ప్రవర్తించారు పంజాబ్ క్రైం బ్రాంచ్ పోలీసులు. మహిళన జీప్ పై కట్టేసి వికృతకాండకు దిగారు. 

వివరాల్లోకి వెళ్తే అమృత్ సర్ సమీపంలోని చౌవిండా దేవి కాలనీలో ఆస్థి తగాదా విషయంలో విచారణకోసం పోలీసులు అక్కడికి వెళ్లారు. బాధితురాలి మామను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నించారు. 

అయితే అతడు లేకపోవడంతో ఆమె భర్తను స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు. కేసులో తన భర్త ప్రమేయం లేదని అతనిని తీసుకెళ్లొద్దని బ్రతిమిలాడింది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన పోలీసులు ఆమెను జీప్ పై కట్టేసి నగరమంతా ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు.  
 
జీప్ ను అత్యంత వేగంగా డ్రైవ్ చేయడంతో ఓ మూలమలుపు వద్ద వేగంగా తిరిగింది. దీంతో ఆమె జీప్ పై నుంచి కిందకు పడి తీవ్ర గాయాలపాలైంది. జీప్ పై నుంచి పడిపోయిన ఆమెను కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్లిపోయారు. 

పంజాబ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసిన ఈ అరాచకం నగరంలోని పలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో అవి వైరల్ గా మారాయి. ఓ మూలమలుపు వద్ద వేగంగా తిరగడంతో ఆమె జీప్ పై నుంచి పడిపోయిన వైనం కూడా కెమేరాల్లో రికార్డయ్యింది. 

పోలీసుల అరాచకత్వానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారాలున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీస్ శాఖ. దీంతో పంజాబ్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు ఈ సంఘటనపై ప్రతిపక్షపార్టీ అకాలీదళ్ స్పందించింది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

click me!