పంజాబ్ సీఎం చన్నీకి ఇద్దరు డిప్యూటీలు.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ

By telugu teamFirst Published Sep 20, 2021, 12:38 PM IST
Highlights

పంజాబ్ నూతన సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనూహ్యంగా చన్నీకి ఇద్దరు డిప్యూటీలను కాంగ్రెస్ ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. చన్నీ ప్రమాణం చేసిన వెంటనే సుఖ్‌జిందర్ సింగ్ రంధావా, ఓపీ సోనీలు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు.
 

చండీగడ్: పంజాబ్ పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అటు తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఇటు నవ్‌జోత్ సింగ్ సిద్దూనూ నొప్పించకుండా దళిత నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టి అసెంబ్లీ ఎన్నికలకు పరిస్థితులను సరిచేసుకుంటున్నది. సామాజిక సమీకరణాలు సంతృప్తి పరిచేలా ఇద్దరు డిప్యూటీ సీఎంలను ఎంచుకున్నది. ఇద్దరు డిప్యూటీలను తెరమీదకు తేవడం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.

ఈ రోజు ఉదయం సీఎంగా చరణ్‌జిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రులుగా సుఖ్‌జిందర్ సింగ్ రంధావా, ఓపీ సోనీలు ప్రమాణం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో బన్వరీలాల్ పురోహిత్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవహారాలను చక్కబెట్టడంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ ఇక్కడ అటెండ్ కావడం చర్చనీయాంశమైంది. 

సీఎంగా చరణ్‌జిత్ సింగ్ అని ప్రకటించినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ సారథ్యంలోనే కాంగ్రెస్ బరిలోకి దిగుతుందన్న హరీశ్ రావత్ వ్యాఖ్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టపరిచాయి. సీఎం రేసులో కొనసాగినట్టు అంచనాలున్న సునీల్ జాఖర్ హరీవ్ వ్యాఖ్యలను ఖండించారు. చరణ్‌జిత్ సింగ్‌ను సీఎంగా ప్రకటించి మరో నేతగా ఎన్నికల్లో దిగడమంటే ఆయన సామర్థ్యాలను, బాధ్యతలను తగ్గించినట్టేనని విమర్శించారు.

ఇప్పుడ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రంధావా కూడా సీఎం రేసులో ఉన్నాడని నిన్న కథనాలు వచ్చాయి. కానీ, ఆయన డిప్యూటీగానే కాంగ్రెస్ ఎంచుకుంది. అయితే, ఆయన జాట్ కమ్యూనిటీకి చెందినవాడు కావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వెషన్‌కు సరిపోతుందని పార్టీ భావించి ఉండవచ్చని తెలుస్తున్నది.

click me!