‘సీఎం చరణ్ జీత్ సింగే.. కానీ సిద్ధూ నాయకత్వంలోనే ఎన్నికలు...’ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు...

By AN TeluguFirst Published Sep 20, 2021, 11:51 AM IST
Highlights

‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా  పాపులర్ వ్యక్తి అయిన పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుంది’ అని హరీష్ రావత్ చెప్పుకొచ్చారు.

చండీగఢ్ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కు మద్దతుగా పార్టీ సీనియర్ నేత హరీష్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. రావత్ వ్యాఖ్యలను  పంజాబీ  పిసిసి మాజీ చీఫ్ సునీల్ జాఖర్ తప్పుపట్టారు.  అసలేం జరిగిందంటే…

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా  దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీని ఎన్నుకున్న విషయం తెలిసిందే.  నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ పరిణామాలపై పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులుగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్  మాట్లాడుతూ…  వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా  పాపులర్ వ్యక్తి అయిన పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుంది’ అని హరీష్ రావత్ చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై సునిల్ జాఖర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ‘నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ ప్రమాణస్వీకారం వేళ..  ‘‘సిద్దూ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్దాం’’ అన్న రావత్ వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు సీఎం  అధికారాలను తక్కువ చేస్తున్నట్లుగా ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.

టెంట్‌ బాయ్‌ టు సీఎం: పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఎవరో తెలుసా?

ఇదిలావుండగా... ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చన్నీ ఈ ఉదయం హరీష్ రావత్ ను కలిశారు. అక్కడినుంచి రాజ్ భవన్ కు బయల్దేరారు. చన్నీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. 

కాగా, 47ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ట్రెయినింగ్ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించారు. చాంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన రమదాసియా సిక్కు కమ్యూనిటీకి చెందినవారు. ఈ కమ్యూనిటీ దళిత వర్గంలో భాగం. దీంతో పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నిలిచారు. కెప్టెన్‌పై తిరుగుబావుటా ఎగరేసినవారిలో చన్నీ కూడా ఉండటం గమనార్హం.

చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో 1972 ఏప్రిల్ 2న చాంకౌర్ సాహిబ్ సమీపంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తండ్రి ఎస్ హర్షా సింగ్ మలేషియాకు వెలసవెళ్లాల్సి వచ్చింది. అనంతరం వ్యాపారంలోకి దిగి సక్సెస్ అయ్యారు. మలేషియా నుంచి తిరిగి వచ్చాక ఖరార్ పట్టణంలో సెటిలై టెంట్ హౌజ్ బిజినెస్ పెట్టుకున్నారు. ఇందులో చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా టెంట్ బాయ్‌గా పనిచేశారు.
 

click me!