గుండెపోటుతో ఏనుగు లక్ష్మి మృతి.. భక్తుల అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు.. 

By Rajesh KarampooriFirst Published Nov 30, 2022, 8:13 PM IST
Highlights

పుదుచ్చేరిలో మనాకుల వినాయకర్‌ ఆలయానికి చెందిన లక్ష్మి అనే ఏనుగు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందింది. లక్ష్మిని మార్నింగ్ వాకింగ్‌ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో గుండె పోటుతో మృతి చెందిందని ఆలయ సిబ్బంది తెలిపారు. లక్ష్మి మరణవార్త విన్న భక్తులు  పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్‌ ఆలయానికి చెందిన లక్ష్మి అనే ఏనుగు బుధవారం మృతిచెందింది. ఏనుగు లక్ష్మిని మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో మృతి చెందిందని ఆలయసిబ్బంది తెలిపారు. లక్ష్మి మరణవార్త తెలియగానే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని లక్ష్మి పార్థివదేహానికి  నివాళులర్పించారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సహా పలువురు ప్రముఖులు ఏనుగు లక్ష్మికి నివాళులర్పించారు. లక్ష్మి అనే ఏనుగును 1995లో ఒక పారిశ్రామికవేత్త ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ ఏనుగు ఆలయానికి వచ్చే భక్తులు,విదేశీ పర్యాటకులను ఆశీర్వదించేది. దీంతో ఈ ఏనుగు బాగా ప్రాచుర్యం పొందింది. .
 
అశ్రు నివాళి

సోషల్ మీడియాలో ఏనుగు మృతి వార్త దావానంలా వ్యాపించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి.. నివాళులర్పించారు. ఏనుగు పార్థీవ దేహంపై పూల వర్షం కురిపించడంతో పాటు ప్రజలు పూలమాలలు వేసి అశ్రు నివాళులర్పించారు. చాలా మంది ఏనుగు మృతదేహాన్ని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నారు. రద్దీని నియంత్రించేందుకు భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. క్రేన్ సాయంతో ఏనుగు మృతదేహాన్ని ట్రక్కు నుంచి పైకి లేపారు.ముత్యాల్‌పేటలో ఆలయానికి అనుబంధంగా ఉన్న భారీ స్థలంలో ఏనుగును ఖననం చేయనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రామచంద్రన్ తెలిపారు. 

click me!