నవాబ్ మాలిక్ కు మరోసారి షాక్ .. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు..

By Rajesh KarampooriFirst Published Nov 30, 2022, 6:09 PM IST
Highlights

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుల కార్యకలాపాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది.

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ ను విచారించిన ముంబైలోని స్పెషల్‌ కోర్టు బెయిల్ ను నిరాకరించింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుల కార్యకలాపాలతో సంబంధం ఉన్న  మనీలాండరింగ్ కేసులో మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌ నిందితుడుగా ఉన్నారు. నవాబ్ మాలిక్ బెయిల్‌ పిటిషన్‌ ను విచారించిన  ప్రత్యేక కోర్టు జడ్జీ రోకడే తిరస్కరించారు. 

మాలిక్‌ బెయిల్‌ పిటిషన్‌పై స్పెషల్‌ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. బెయిల్ విషయంలో గతంలోనే విచారణ చేసి.. తీర్పును నవంబర్‌ 14న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. నవంబర్ 24న తీర్పు వెలువరిస్తామని గతంలో కోర్టు తెలిపింది. అయితే.. ఆ రోజున కోర్టు ఉత్తర్వులు సిద్ధంగా లేవని పేర్కొంటూ కేసును నవంబర్ 30కి వాయిదా వేసింది. ఎట్టకేలకు ఇవాళ ప్రత్యేక కోర్టు తీర్పును వెల్లడిస్తూ.. బెయిల్ ను నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. త్వరలో పూర్తి వివరాలతో కూడిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

మనీలాండరింగ్‌ కేసులో విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో  అరెస్టు చేసింది. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అదేసమయంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మాలిక్ జూలైలో పిటిషన్ దాఖలు 

మాలిక్ జూలైలో ప్రత్యేక కోర్టులో రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును దాఖలు చేశారు. మనీలాండరింగ్ వ్యవహరంలో తాను ఎలాంటి నేరం లేదని బెయిల్ కోరారు. అయితే ఈడీ దీన్ని వ్యతిరేకించింది. నిందితుడు దావూద్ ఇబ్రహీం, అతని సోదరి హసీనా పార్కర్‌తో కలిసి పనిచేస్తున్నాడని, అతడు నిర్దోషి అని పేర్కొనే ప్రశ్నేలేదని ఈడీ పేర్కొంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అంతర్జాతీయ ఉగ్రవాది, ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం,అతని సహచరులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. 

click me!