
మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 25న ఉదయం 11 గంటలకు ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు. ‘‘ముంబై పోలీసులు నోటీసు జారీ చేశారు. ఆమెను పైడోనీ పోలీస్ స్టేషన్ ఎదుట హాజరుకావాలని సూచించారు’’ అని ఓ అధికారి వార్తా సంస్థ ఏఎన్ఐతో తెలిపారు.
రజా అకాడమీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పైధోనీ పోలీస్ స్టేషన్ లో శర్మపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు అయ్యింది. 2022 మే చివరి వారంలో నూపుర్ శర్మ ఒక చర్చ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. అరబ్ కంట్రీస్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయా ఆయా దేశాల్లో ఉన్న భారత ప్రతినిధులను పిలిపించుకొని ఈ వ్యాఖ్యలపై వివరణ అడిగాయి. దీంతో వారు సమాధానమిస్తూ.. నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలు భారత్ అభిప్రాయాలు కావని తెలిపారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
Saharanpur violence: సహరన్‌పూర్ హింస ఘటన.. నిందితుల అక్రమ ఆస్తుల కూల్చివేత.. 64 మంది అరెస్టు..
ఇలా అరబ్ దేశాలు ఈ విషయంలో కల్పించుకోవడంతో బీజేపీ నూపుర్ శర్మను చేసింది. ఇలాంటి వ్యాఖ్యలనే ట్వీట్ చేసినందుకు బీజేపీ నాయకుడు నవీన్ జిందాల్ ను కూడా ఆ పార్టీ బహిష్కరించింది. అయితే నూపుర్ శర్మపై వివిధ రాష్ట్రాల్లో అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నూపుర్ శర్మ సస్పెండ్ అయినప్పటికీ.. ఆమెకు బెదిరింపులు రావడం మాత్రం ఆగలేదు. చంపేస్తామని తల నరికేస్తామని హెచ్చరికలు కూడా వచ్చాయి. ఇస్లామిక్ తీవ్రవాదులు ఆమెను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించారు. కాగా ఆమె తలపై రూ .20 లక్షల నుండి రూ .1 కోటి వరకు బహుళ బౌంటీ ఆఫర్లు ప్రకటించారు.
కాగా.. సస్పెన్షన్ కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను అరెస్టు చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ అంశంపై ఎవరూ హింసను ఆశ్రయించరాదని లేదా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన నొక్కి చెప్పారు, కానీ టీవీ చర్చలో ఆమె వ్యాఖ్యలు నిప్పులు చెరిగిన తరువాత శర్మపై వెంటనే చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలమైందని ఆయన విమర్శించారు.
నాగాలాండ్ కాల్పుల కేసు.. 30 మంది ఆర్మీ సిబ్బందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
‘‘ నూపుర్ శర్మపై చర్యలు తీసుకోవడం లేదు. చట్టప్రకారం ఆమెను అరెస్టు చేయాలి. ఇన్ని రోజులుగా ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదు. నూపుర్ శర్మపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు ? ’’ అని ఒవైసీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకోలేదని అన్నారు. అందుకే ఆమె అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసినప్పుడే బీజేపీ మందలించలేదని తెలిపారు. ఆమెను సస్పెండ్ చేయడానికి బీజేపీకి 10 రోజులు పట్టిందని విమర్శించారు.