యోగి ఆదిత్యానాథ్ హయాంలో ఎన్‌కౌంటర్‌లలో 183 మంది నేరస్తులను చంపిన ఘటనలను దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. ఈ ఎన్‌కౌంటర్లను విచారించడానికి నిపుణులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. 2017 నుంచి 10,900 ఎన్‌కౌంటర్లు జరగ్గా.. అందులో 183 మంది నేరస్తులు మరణించినట్టు యూపీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
న్యూఢిల్లీ: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను పోలీసులు, మీడియా సమక్షంలోనే చంపేసిన తర్వాతి రోజు సుప్రీంకోర్టులో ఎన్‌కౌంటర్ హత్యలను దర్యాప్తు చేయాలనే పిటిషన్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్2లో 2017 నుంచి 183 మంది నేరస్తుల ఎన్‌కౌంటర్ హత్యల ఉదంతాలను దర్యాప్తు చేయాలని అడ్వకేట్ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. ఈ దర్యాప్తు కోసం నిపుణులతో ఓ స్వతంత్ర కమిటీ వేయాలని కోరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్మన్‌షిప్‌లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్‌కౌంటర్ హత్యలను దర్యాప్తు చేయాలని పిటిషన్ వేసిన విశాల్ తివారీ.. అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ల హత్యలనూ దర్యాప్తు చేయాలని కోరారు.
ఉత్తర ప్రదేశ్ పోలీసులు శుక్రవారం సంచలన వివరాలు వెల్లడించారు. యోగి ఆదిత్యానాథ్ ఆరేళ్ల పాలనా కాలంలో 183 మంది నేరస్తులను ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలిపారు. ఇందులో అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, అనుచరుడు గులాంల ఎన్‌కౌంటర్ హత్యలూ ఉన్నాయి.
Also Read: అవార్డు కార్యక్రమంలో విషాదం.. మండే ఎండల్లో 6 గంటలు.. 11 మంది మృతి!.. 600 మందికి వడదెబ్బ
2017 మార్చి నుంచి 10,900 పోలీసు ఎన్‌కౌంటర్లు జరిగినట్టు యూపీ పోలీసుల డేటా వివరిస్తున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లలో 23,300 నేరస్తులను అరెస్టు చేశారని, 5,046 మంది గాయపడ్డారని తెలుపుతున్నది. అలాగే, ఈ ఎన్‌కౌంటర్‌లలో 1,443 మంది పోలీసులు గాయపడగా.. 13 మంది మరణించారని వివరిస్తున్నది.