
ప్రధాని మోదీ పర్యటన: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది. దక్షిణాది రాష్రాలైన తెలంగాణ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో అధికారంలోకి రావాలని యోచిస్తోంది. అందుకు తగినట్టుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, ఏపీలను టార్గెట్ గా చేసుకుని బీజేపీ పావులు కదుపుతోంది. ఎలాగైనా ఆ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు వచ్చే భారీ ప్రణాళికలు రచిస్తోంది. కర్ణాటక ఎన్నిక నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి
దక్షిణ భారత పర్యటనకు సిద్దమయ్యారు. ఈ రాష్ట్రాల్లో అనేక పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాని మోడీ ఏప్రిల్ 8, 9 తేదీల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ రాష్ట్రాల్లో అనేక పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా తెలంగాణ, తమిళనాడులో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించడంతో పాటు చెన్నై విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించనున్నారు.
తెలంగాణలో వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం,శంకుస్థాపన
ప్రధాని మోడీ ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో రూ.11,300 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో రెండు నగరాల మధ్య దూరాన్ని కేవలం మూడున్నర గంటల్లోనే అధిగమించవచ్చు. దీంతో పాటు బీబీనగర్‌లో ఎయిమ్స్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. ఈ పర్యటనలో హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగర ప్రాంతంలోని సబర్బన్ విభాగంలో 13 కొత్త మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (MMTS) సేవలను ప్రధాన మంత్రి ఫ్లాగ్-ఆఫ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి రూ.7,850 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ రోడ్డు ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల రహదారి కనెక్టివిటీని బలోపేతం చేస్తాయి. ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి.
తమిళనాడులో విమానాశ్రయం ప్రారంభం
ప్రధాని మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా రూ. 1260 కోట్లతో నిర్మించిన చెన్నై విమానాశ్రయం కొత్త టెర్మినల్ (ఫేజ్-1)భవనాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటు చెన్నై-కోయంబత్తూరు మధ్య నడిచే వందే భారత్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అనంతరం శ్రీ రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారు. అలాగే.. తిరుతురైపూండి ,అగస్తియంపల్లి మధ్య 294 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన 37 కి.మీ గేజ్ కన్వర్షన్ సెక్షన్‌ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. దీంతో పాటు చెన్నైలోని ఆల్‌స్ట్రోమ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. దీంతో పాటు దాదాపు రూ.3700 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు.
కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన ఇలా..
ప్రధాని మోదీ బందీపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శిస్తారు. పరిరక్షణ కార్యకలాపాలలో పాల్గొన్న ఫ్రంట్‌లైన్ ఫీల్డ్ సిబ్బంది మరియు స్వయం సహాయక బృందాలతో సంభాషిస్తారు. అనంతరం.. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపును కూడా సందర్శించి, ఏనుగుల శిబిరంలోని మహోత్‌లు , కావడిలతో సంభాషించనున్నారు. ఆ తరువాత ప్రధాన మంత్రి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబిసిఎ)ని ప్రారంభించనున్నారు.
దీంతో పాటు తమిళనాడులో 50 ఏళ్ల ప్రాజెక్ట్ టైగర్ జ్ఞాపకార్థం కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ 2019లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్‌ను ప్రారంభించారు. దీని కింద పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ మరియు చిరుత వంటి జంతువులు రక్షించబడతాయి. ప్రాజెక్ట్ టైగర్‌కు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధాన మంత్రి విడుదల చేస్తారు.