జ్ఞానవాపి కేవలం ఒక నిర్మాణం కాదని... జ్ఞానాన్ని పొందే మార్గం, స్వయంగా శివునికి చిహ్నమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
గోరఖ్‌పూర్ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, గోరక్ష పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోకి జ్ఞానవాపి వివాదంపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆది శంకరాచార్యులు జ్ఞాన సాధన కోసం చేపట్టిన కాశీ యాత్రను ప్రస్తావిస్తూ... జ్ఞానవాపి కేవలం ఒక నిర్మాణం కాదు, అది జ్ఞానాన్ని పొందే మార్గమని అన్నారు. స్వయంగా భగవాన్ విశ్వనాథునికి చిహ్నమని అన్నారు. జ్ఞాన సాధన కోసం కాశీ వచ్చిన ఆది శంకరులకు భగవాన్ విశ్వనాథుడు ఒక అంటరాని చండాలుడి రూపంలో దర్శనమిచ్చి అద్వైతం, బ్రహ్మం గురించి జ్ఞానబోధ చేశారని యోగి పేర్కొన్నారు.
యుగపురుషుడు బ్రహ్మలీన మహంత్ దిగ్విజయనాథ్ జీ మహారాజ్ 55వ, బ్రహ్మలీన మహంత్ అవేద్యనాథ్ జీ మహారాజ్ 10వ పుణ్యతిథి సందర్భంగా శ్రీమద్భాగవత మహాపురాణ కథా జ్ఞానయజ్ఞం చేపట్టారు. నిన్న శుక్రవారం ఈ యజ్ఞం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలుచేసారు.
గోరఖ్‌నాథ్ దేవాలయంలోని దిగ్విజయనాథ్ స్మృతి భవన్ సభా ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి యోగి మాట్లాడుతూ...,భగవంతుడు ఏ రూపంలో దర్శనమిస్తాడో ఎవరికీ తెలియదని అన్నారు. ఈ సందర్భంగా ఒక సంఘటనను ప్రస్తావిస్తూ కేరళ నుండి వచ్చిన సన్యాసి ఆది శంకరులు తాను అద్వైత జ్ఞానంలో పరిపక్వత సాధించానని భావించి జ్ఞానార్జన కోసం భగవాన్ విశ్వనాథుని పుణ్యక్షేత్రమైన కాశీకి వచ్చారని ముఖ్యమంత్రి అన్నారు. ఒకరోజు ఉదయం ఆయన గంగా స్నానానికి వెళ్తుండగా, భగవాన్ విశ్వనాథుడు అంటరాని వ్యక్తిగా భావించే చండాలుడి రూపంలో ఆయనకు ఎదురయ్యారు. ఆది శంకరులు ఆ అంటరాని వ్యక్తిని దారి నుండి తప్పుకోమని చెప్పగా, ఆయన నుండి 'మీరు అద్వైత విద్యలో పండితులు. మీరు బ్రహ్మ సత్యం అని చెబుతారు. మీలో ఉన్నది, నా బ్రహ్మం వేరు వేరుగా ఉంటే మీ అద్వైతం నిజం కాదు. మీరు నా చర్మాన్ని చూసి అంటరాని వాడిగా భావిస్తున్నారా' అని సమాధానం వచ్చింది. అప్పుడు ఆది శంకరులకు తాను కాశీ వచ్చి వెతుకుతున్న భగవాన్ విశ్వనాథుడే ఇలా దర్శనమిచ్చాడని తెలిసింది.
సంపన్న సంప్రదాయం, ప్రాచీనత, సంస్కృతి, చరిత్రపై గర్వ భావాన్ని కలిగించే కథలు
కథలంటే కేవలం వినడం మాత్రమే కాదని, వాటి బోధనలను జీవితంలో అలవర్చుకోవడం కూడా అని సీఎం యోగి అన్నారు. శ్రీమద్భాగవత మహాపురాణం లేదా ఇతర కథలు భారతదేశం యొక్క గొప్ప సంప్రదాయం, ప్రాచీనత, సంస్కృతి, చరిత్రపై గర్వ భావాన్ని కలిగిస్తాయి. ఐదు వేల సంవత్సరాలుగా ఈ కథలను భారతదేశంలో వింటున్నారు. భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం అని ఆయన అన్నారు. భారతదేశ ఆత్మ ధర్మంలో ఉంది, ఈ ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మ కథలు సామాజిక సమైక్యత మరియు జాతీయ సమైక్యతకు మూలస్తంభాలు అని యోగి అన్నారు.
సాధువుల సంప్రదాయం భారతదేశాన్ని ఐక్యతతో ముడిపెట్టింది
మహా యోగి గురు గోరఖ్‌నాథ్‌తో సహా మన ఆచార్యులు, సాధువులు, ఋషులు, మునులు భారతదేశాన్ని ఐక్యతతో ముడిపెట్టే సంప్రదాయాన్ని బలోపేతం చేశారని సీఎం యోగి అన్నారు. మన దేశంలో ఒకవైపు విధ్వంసక సంప్రదాయం నడిచింది, వారిని అసురులు అని పిలిచేవారు. వివిధ కాలాల్లో వారి రూపాలు రావణుడు, కంసుడు లేదా దుర్యోధనుడి రూపంలో మనం చూశాం. మరోవైపు దైవశక్తితో నిండిన ఋషులు, మునుల సంప్రదాయం, తీర్థయాత్రల సంప్రదాయం కూడా కొనసాగింది. ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి గంగోత్రి నుండి నీటిని తీసుకువెళ్లి రామేశ్వరంలో సమర్పించడం, రామేశ్వరానికి చెందిన వ్యక్తి కేదార్‌నాథ్‌లో జలాభిషేకం చేయడం భారతదేశాన్ని ఏకం చేసే సంప్రదాయమే అని ఆయన అన్నారు.
కథలు కోట్లాకు పైగా ప్రజలకు విముక్తి మార్గాన్ని చూపించాయి
శ్రీమద్భాగవత మహాపురాణం, ఇతర కథలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ముందుకు సాగడానికి మనకు స్ఫూర్తినిస్తాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఐదు వేల సంవత్సరాలుగా ఈ కథలు కోట్లాకు పైగా ప్రజలకు విముక్తి మార్గాన్ని చూపించాయి. మన పూర్వీకులను మరియు ఆచార్యుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి మనం భక్తి శ్రద్ధలతో కథలను చెప్పుకుంటామని ఆయన అన్నారు. శ్రీమద్భాగవత మహాపురాణ కథను వినిపించడానికి అమెరికా నుండి నేరుగా గోరఖ్‌పూర్ వచ్చిన కథా వ్యాఖ్యాత కాశీపీఠాధిపతి డాక్టర్ రామ్ కమల్ వేదాంతి జీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కథ ముగింపు సందర్భంగా సీఎం యోగి దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలోని రాజకీయ శాస్త్ర విభాగం నుండి పదవీ విరమణ పొందిన ఆచార్యులు ప్రొఫెసర్ సిబి సింగ్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమం సందర్భంగా వేదికపైకి వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాస పీఠాన్ని పూజించి, కథ ముగిసిన తర్వాత హారతి ఇచ్చారు. గోరఖ్‌నాథ్ దేవాలయంలో ఏడు రోజుల పాటు భక్తులకు శ్రీమద్భాగవత కథను వ్యాస పీఠంపై ఆసీనులైన కథా వ్యాఖ్యాత, శ్రీరాం దేవాలయం గురుధామ్ కాశీ నుండి విచ్చేసిన జగద్గురు అనంతానంద భారతీచార్య కాశీపీఠాధిపతి స్వామి డాక్టర్ రామ్‌కమల్ దాస్ వేదాంతి జీ వినిపించారు. ఈ సందర్భంగా గోరఖ్‌నాథ్ దేవాలయ ప్రధాన పూజారి యోగి కమల్‌నాథ్, మహంత్ నారాయణ్ గిరి, స్వామి విద్యా చైతన్య, మహంత్ ధర్మదాస్, రామ్ దినేశాచార్యతో సహా అనేక మంది సాధువులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.