గౌతమ్ గంభీర్ ఆశలపై ప్రశాంత్ కిషోర్ నీళ్లు

By telugu teamFirst Published Dec 14, 2019, 5:53 PM IST
Highlights

ఇంకో రెండు నెలల్లో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో గంభీర్ లో ఇప్పుడు ఒక్కసారిగా టెన్షన్ మొదలయ్యింది. ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డు చూస్తే మనకు అదే అర్థమవుతుంది. 

న్యూఢిల్లీ: ఇంకో రెండు నెలల్లో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఢిల్లీలో అధికారం లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం మొదలు... విద్య వైద్యం ఇలా అనేక రంగాల్లో నూతన ఒరవడులకు శ్రీకారం చుడుతూ దూసుకుపోతున్నారు. 

ఢిల్లీ మధ్యతరగతి ప్రజల్లో కేజ్రీవాల్ పట్ల అమితమైన క్రేజ్ ఉంది. కేజ్రీవాల్ కె అనుకూలంగా అక్కడ పవనాలు వీస్తున్నాయి. కాకపోతే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని 7 లోక్ సభ సీట్లలోనూ ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూసి ఒకింత నైరాశ్యంలో పడింది. 

కాకపోతే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత కేజ్రీవాల్ లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు రెండు వేరువేరు అనే నమ్మిక బలంగా పడింది. మరోపక్క బీజేపీ ఏమో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రాజెక్ట్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంది. 

గత ఎన్నికల్లో అరువు తెచ్చుకున్న కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రయోగించగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సారి ఎన్నికల్లో నటుడు మనోజ్ తివారినో లేదా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ తనకు అనుకూలంగా బలంగా లాబీయింగ్ నడుపుతున్నాడు. తన అభిమానులతో కలుస్తూ, ఢిల్లీ అంతా కలియతిరుగుతున్నాడు. ఢిల్లీ అంతటా ఇప్పటికే గౌతమ్ గంభీర్ పోస్టర్లు వెలిశాయి. 

బీజేపీ పరిస్థితి ఇలాగ ఉంటే, మరోపక్క కాంగ్రెస్ ఏమో షీలా దీక్షిత్ మరణంతో పెద్ద దిక్కు లేకుండా తయారయ్యింది. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే పోటీ అనుకోని ప్రణాళికలు రచించిన గౌతమ్ గంభీర్ కి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. 

ప్రశాంత్ కిషోర్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో గంభీర్ లో ఇప్పుడు ఒక్కసారిగా టెన్షన్ మొదలయ్యింది. ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డు చూస్తే మనకు అదే అర్థమవుతుంది. 

ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా పేరుమోసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో జత కట్టబోతున్నారు. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ మరోమారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థ ఐపాక్ తో ఒప్పందం చేసుకున్నాడు. 

ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ఇందాక ఒక గంట కింద కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన ట్వీట్ చేయగానే ఐపాక్ కూడా ఆ ట్వీటును రే ట్వీట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జగన్ తో జత కట్టి ఆయన గెలుపుకు ఎంత కృషి చేసారో మనందరికీ తెలిసిన విషయమే. 

Also read: డీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్...ఏపీ మ్యాజిక్ రిపీట్ చేయగలడా?

ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బెంగాల్ లో మమతా బెనర్జీ కోసం, తమిళనాడులో డీఎంకే కు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 

ప్రశాంత్ కిషోర్ బిజెపి మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) జేడీయూ, పార్టీకి ఉపాధ్యక్షుడు గా కొనసాగుతున్నాడు. 2014 లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపికి  విజయవంతమైన లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రూపకల్పన చేసినందుకు గాను, ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా యావత్ దేశానికి సుపరిచితుడయ్యాడు.  ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథంతో ఏ పార్టీ అనే తేడా లేకుండా తమ సహాయ సహకారాలు కోరిన వారందరికీ అందిస్తుంది. 

click me!