
One Nation - One Election: దేశంలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ఓ వ్యూహానికి తెర తీసింది. అదే వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై తీవ్రంగా కసరత్తు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేత్రుత్వంలో 8మంది సభ్యులతో ఓ హై లెవల్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఈ తరుణంలో ఒకే దేశం- ఒకే ఎన్నికపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు.
తాజాగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. సరైన ఉద్దేశంతో అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. అలా అయితేనే తన మద్దతు ఉంటుందన్నారు. సరిగ్గా జరిగితే 4-5 సంవత్సరాల పరివర్తన దశ ఉంటే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇది అంతకుముందు కూడా 17-18 ఏళ్లుగా దేశంలో అమల్లో ఉందన్నారు.
భారతదేశం వంటి పెద్ద దేశంలో ప్రతి సంవత్సరం జనాభాలో 25 శాతం మంది ఓటు వేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపే వారు ఎన్నికల శంఖారావంలో బిజీబిజీగా ఉన్నారనీ, ఈ విధానం అమలు చేస్తే.. ఖర్చు కూడా ఆదా అవుతుందనీ, ప్రజలు కూడా ఒక్కసారి మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ ఇంకా మాట్లాడుతూ.. ప్రభుత్వం రాత్రికి రాత్రే మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తే సమస్యలు వస్తాయని అన్నారు. బహుశా ప్రభుత్వం దీనిపై బిల్లు కూడా తీసుకువస్తోందని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు సక్రమంగా ఉంటే అమలు చేయాలనీ, అలా అయితేనే దేశానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు.
మాజీ రాష్ట్రపతి అధ్యక్షతన కమిటీ
సెప్టెంబరు 1న కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయబడింది. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ఒకే దేశం-ఒకే ఎన్నికల అవకాశాలను పరిశీలించిన తర్వాత నివేదికను సమర్పిస్తుంది.