Exclusive: ఆయోధ్య మందిరంలో రామయ్య జనవరిలో కొలువుదీరుతారు: ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

Published : Sep 01, 2023, 03:58 PM ISTUpdated : Sep 01, 2023, 04:16 PM IST
Exclusive: ఆయోధ్య మందిరంలో రామయ్య జనవరిలో కొలువుదీరుతారు: ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

సారాంశం

అయోధ్య రామ మందిరాన్ని జనవరిలో ప్రారంభిస్తామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఏషియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జనవరి 14వ తేదీ నుంచి 24వ తేదీల మధ్యలో ప్రధాని మోడీ నిర్ణయించిన రోజున రాముడి విగ్ర ప్రాణ ప్రతిష్టాపన ఉంటుందని తెలిపారు.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో అయోధ్య మందిరంలో రాముడు కొలువుతీరుతారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. కొత్తగా నిర్మించిన భారీ రామ మందిరంలో రాముడి విగ్రహానికి తుది ప్రాణ ప్రతిష్ట ఈ తేదీల మధ్యలో ప్రధాని మోడీ నిర్ణయించిన రోజు జరుగుతుందని తెలిపారు. 

జనవరి 14వ తేదీ నుంచే విగ్రహ ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేశ్ కల్రాతో మాట్లాడుతూ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ‘మేము ప్రధాని మోడీని ఆహ్వానించాం. ఆయన నుంచి సమాధానం ఇంకా మాకు అందలేదు. జనవరి 14వ తేదీ నుంచి ప్రార్థనలు మొదలవుతాయి. ఆ తర్వాత జనవరి 24వ తేదీలోపు ఆయన నిర్ణయించిన రోజు మేం తుది ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ రోజు రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం. తర్వాతి రోజు నుంచే భక్తులు దర్శనానికి విచ్చేయవచ్చు. ప్రస్తుత రాముడి విగ్రహాన్ని ఆలయంలో తీర్చిదిద్దిన భారీ విగ్రహం ముందు ఉంచుతాం’ అని నృపేంద్ర మిశ్రా తెలిపారు.

సుమారు ఏడాది క్రితం ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిర స్థలానికి వెళ్లింది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి. భారీ రామ మందిరం రూపు దిద్దుకుంది. గతేడాది రామ మందిర నిర్మాణ స్థలంలోకి ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌కు అనుమతించిన మిశ్రా.. మరోసారి పురోగతిలో ఉన్న నిర్మాణాన్ని చూపించారు. వచ్చే ఏడాది జనవరిలో నిర్మాణం పూర్తి చేసుకున్న రామ మందిరాన్ని ప్రారంభించగలమని విశ్వాసాన్ని వెల్లడించారు.

ఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియ నిర్మాణ దశలనూ పర్యవేక్షిస్తున్న మిశ్రా.. ప్రధాని మోడీ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి వారానికి ఒకసారి అయోధ్యకు వచ్చి ఇక్కడ నిర్మాణ పురోగతిని సమీక్షిస్తున్నారు. ప్రతి శనివారం ఆయన అయోధ్యకు వచ్చి భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై నిర్దేశం ఇస్తుంటారు. 

సమగ్ర ఇంటర్వ్యూ త్వరలోనే ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతుంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్