
ఢిల్లీ : తనకు ఓటు వేయలేదని ఓ మాజీ ఎంపీ దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు వ్యక్తుల్ని కిరాతకంగా హతమార్చాడు. 28యేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. 28యేళ్ల క్రితం ఎన్నికల రోజు జంట హత్యలు జరిగాయి. ఈ కేసులో ఆర్జేడీ నేత, మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కు జీవితఖైదు పడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. గతంలో ఈ కేసులో ఆర్జేడీ నేత, మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ ను పట్నా హైకోర్టు గతంలో నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పును గతనెల సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ ను దోషిగా తేలుస్తూ.. తాజాగా శిక్ష ఖరారు చేసింది. దీంతోపాటు మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
1995లో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రభునాథ్ సింగ్ బీజేపీ తరఫున పోటీచేశారు. పోలీంగ్ రోజున సరణ్ జిల్లాలోని చాప్రాలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. ప్రభునాథే ఆ కాల్పులు జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాను సూచించినట్లు ఓటు వేయలేదన్న కోపంతో అలా చేశాడని.. ఆయన మీద కేసు నమోదయ్యింది.
అయితే, ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ప్రభునాథ్ ను నిర్దోషిగా తేల్చింది కోర్టు. 2008 డిసెంబర్ లో ట్రయల్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దీని తరువాత 2012లో పట్నా హైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ ను నిర్దోషిగా ప్రకటించింది. దీన్ని మృతుల కుటుంబసభ్యులు సుప్రీంలో సవాల్ చేశారు. దీనిమీద సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది.
హైకోర్టు నిర్దోషిగా ఇచ్చిన తీర్పును కొట్టేసింది. మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ ను జంట హత్యల కేసులో దోషిగా తేల్చింది. జీవితకాల ఖైదు విధించింది. మరోవైపు 1995 ఎన్నికల్లో ప్రభునాథ్ మీద గెలిచిన ఎమ్మెల్యే అశోక్ సింగ్ కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కూడా 2017లో ప్రభునాథ్ నే దోషిగా తేలాడు. హజారీబాఘ్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రభునాథ్ సింగ్ గతంలో జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ పార్టీల్లో ఉన్నారు. ఆ తరువాత ఆర్జేడీలో చేరారు. నాలుగు సార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.