మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ

By SumaBala Bukka  |  First Published Nov 17, 2023, 8:38 AM IST

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. 


మధ్య ప్రదేశ్ : ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్ గఢ్ లోని 70 స్థానాలకు రెండో విడతలో శుక్రవారం నాడు పోలింగ్ జరుగుతోంది.  ఛత్తీస్ గఢ్ లోని 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7వ తేదీన మొదటి విడతలో పోలింగ్ జరిగింది. నక్సల్స్ సమస్యాత్మక ప్రాంతాలైన 20 అసెంబ్లీ  స్థానాల్లో మొదటి విడతలో  పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 

మధ్యప్రదేశ్లో ఐదు కోట్ల 60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 230 అసెంబ్లీ స్థానాలకు 2,533 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, మండల, దిండోరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఓటింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతను, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.

Latest Videos

Praveen Chakravarty : కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ వింగ్ చైర్మన్ గా ప్రవీణ్ చక్రవర్తి.. శశిథరూర్ స్థానంలో నియామకం

ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఇవి కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్లో మొత్తం 64,626 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 64,523 ప్రధాన పోలింగ్ కేంద్రాలు కాక 13 సహాయక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 123 పోలింగ్ కేంద్రాలు వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొదటిసారిగా 371 యూత్ మేనేజ్మెంట్ బూత్ లు, 2,536 మోడల్ పోలింగ్ కేంద్రాలను, బాలాఘాట్  57, జబల్పూర్ జిల్లాలో 50 గ్రీన్ బూత్ లను ఏర్పాటు చేశారు.

ఇక ఛత్తీస్ గఢ్ లో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరగనుండగా.. రాజిమ్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత బింద్రానవగఢ్ నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే ఓటింగ్ జరగనుంది. ఇక ఛత్తీస్గఢ్లోని రెండో, తుది విడత పోలింగ్ జరుగుతున్న మొత్తం 70  స్థానాలకు 958మంది అభ్యర్థులు బరిలో  ఉన్నారు. పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 130 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్, 827 మంది పురుషులు ఉన్నారు. 

click me!