మహిళా డాక్టర్ పై ఓ దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టాడు. దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. విద్యావంతులకూ ఇలాంటి కామాంధుల చేతిలో వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ మహారాష్ట్రలో ఓ డాక్టర్ అత్యాచారం జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకు చెందిన ఓ మహిళా డాక్టర్ కు కొంత కాలం కిందట వివాహం జరిగింది. అయితే పలు కుటుంబ సమస్యల కారణంగా ఆమె భర్తతో కలిసి జీవించడం లేదు. ఈ విషయంపై మాట్లాడుదామని ఓ వ్యక్తి ఆమెను పిలిచాడు. అది నమ్మి ఆమె అతడి దగ్గరికి వెళ్లింది. దీనిని మంచి అవకాశంగా అతడు భావించాడు. బలవంతంగా ఆ మహిళా డాక్టర్ తో మద్యం తాగించాడు.
ఆమె స్పృహ కోల్పోయిన తరువాత, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యను అతడు వీడియో తీశాడు. ఆ వీడియో ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమెను పలుమార్లు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి ఆ డాక్టర్ నిరాకరించింది. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. అతడి చేష్టలకు విసుగెత్తిపోయిన ఆ మహిళా డాక్టర్.. పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించాడు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 384 (దోపిడీ) కింద అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన వెలుగులోకి వచ్చింది. ఆగ్రా జిల్లాకు చెందిన 25 ఏళ్ల ఓ యువతి హోటల్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను పలువురు దుండగులు ఓ సంపన్న హోమ్ స్టేకు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
నిందితులు తనకు సంబంధించిన ఓ అభ్యంతరకరమైన వీడియోను రూపొందించారని, దాని ద్వారా తనను బ్లాక్ మెయిల్ చేశారని తెలిపింది. బలవంతంగా తనకు మద్యం తాగించారని, తలపై గాజు సీసా పగులగొట్టారని బాధితురాలు పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. ఒక మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 307 (హత్యాయత్నం), 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం), అనైతిక ట్రాఫిక్ నిరోధక చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.