
నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బీహార్‌లో చేపట్టిన కులగణనను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. బీహార్‌లో కులగణనను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టివేసిన తర్వాత పీకే ఈ వ్యాఖ్యలు చేశారు. కులగణన అనేది సమాజాన్ని విభజించే లక్ష్యంతో రాజకీయ ఎత్తుగడ అని కిశోర్ అన్నారు. ఈ జనాభా లెక్కల సమయం రాజకీయ ప్రేరేపితమని.. నితీష్ కుమార్, లాలూ యాదవ్ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు తమ హయాంలో కులగణనను ఎందుకు నిర్వహించలేకపోయాయని ప్రశ్నించారు.
నితీశ్ కుమార్ ఇంతకాలం ముఖ్యమంత్రిగా వుండి కూడా ఇప్పటి వరకు కుల గణన ఎందుకు చేయలేదని బీహార్ ప్రజలు ఆలోచించాలని ప్రశాంత్ కిశోర్ నిలదీశారు. నిజం ఏమిటంటే ఇది కులగణన కాదని.. ఇది ఒక సర్వే అని.. మొత్తం సమాజం విడిపోయేలా కుల రాజకీయాలు చేయాలని కిశోర్ ఆరోపించారు. రాష్ట్రంలో అసలైన సమస్య నిరక్షరాస్యత అని అన్నారు. పేదల పిల్లలు చదువుకుంటే .. ఈ నిరక్షరాస్యులను నాయకులుగా ఎవరు పరిగణిస్తారని బీహార్ ప్రజలు అర్ధం చేసుకోవాలని కిశోర్ పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్ట్ మంగళవారం కొట్టివేసింది. బీహార్‌లో కులాల సర్వే రెండు దశల్లో జరగేలా ప్లాన్ చేశారు. మొదటి దశ ఇంటింటి లెక్కింపు ప్రక్రియ. దీనిని ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఏప్రిల్ 15న ప్రారంభమైన రెండవ దశలో ప్రజల కుల, సామాజిక ఆర్ధిక స్థితిగతులపై డేటాను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రక్రియ మొత్తం ఈ ఏడాది మే నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే మే 4న కుల గణనపై హైకోర్ట్ స్టే విధించింది. దీంతో కుల ఆధారిత సర్వేపై స్టే విధిస్తూ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో సుప్రీం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ అంశాన్ని పాట్నా హైకోర్ట్ మంగళవారం విచారించి.. అన్ని సవాల్‌లను కొట్టివేసింది.