ప్రధాని మణిపూర్‌లో పర్యటించి శాంతిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి.. రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు

Published : Aug 02, 2023, 02:14 PM IST
ప్రధాని మణిపూర్‌లో పర్యటించి శాంతిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి.. రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు

సారాంశం

రాష్ట్రపతి ద్రౌపది  ముర్మను బుధవారం ప్రతిపక్ష పార్టీల నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా వారు మణిపూర్ సమస్యపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మను  కోరారు.

రాష్ట్రపతి ద్రౌపది  ముర్మను బుధవారం ప్రతిపక్ష పార్టీల నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా వారు మణిపూర్ సమస్యపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మను  కోరారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి ముర్ము నుండి సమయం కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన బృందంలో.. జూలై 29-30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటించిన ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలతో పాటు, పలు ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్ లీడర్‌లు ఉన్నారు. 

రాష్ట్రపతితో భేటీ  అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోందని, ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బుధవారం కలిసినట్టుగా చెప్పారు. మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి నేతలు వినతి పత్రం అందించినట్టుగా తెలిపారు. 

‘‘మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపీలతో సహా I.N.D.I.A కూటమికి చెందిన 31 మంది సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలుసుకుని అక్కడి పరిస్థితిని ఆమెకు వివరించాం. రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించాం. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పునరావాసం, ఇతర పరిస్థితులపై మేము రాష్ట్రపతికి వివరించాము’’ అని ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని ఖర్గే చెప్పారు. 

ఇక, మెమోరాండంలో ప్రతిపక్ష నాయకులు మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంటులో అత్యవసరంగా ప్రసంగించేలా ప్రధాని మోదీపై ఒత్తిడి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించారు. ‘‘ఇక ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడానికి మీ దయతో కూడిన జోక్యాన్ని మేము తక్షణమే అభ్యర్థిస్తున్నాము. బాధిత వర్గాలకు న్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంటులో అత్యవసరంగా ప్రసంగించవలసిందిగా ప్రధానమంత్రిని ఒత్తిడి చేయవలసిందిగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఆ తర్వాత ఈ విషయంపై వివరణాత్మక, సమగ్రమైన చర్చ జరగాలి’’ అని మెమోరాండంలో విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. 

బీజేపీ పాలిత మణిపూర్ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతోందని, ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. పార్లమెంట్‌ వేదికగా ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై సమగ్ర ప్రకటన చేయాలని, రూల్ 267 కింద చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అధికారంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రం మణిపూర్‌పై స్వల్పకాలిక చర్చకు సిద్దమని చెబుతుంది. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !