2024 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కనీసం 40 నుంచి 50 సీట్లను సాధించాలని సంకల్పించింది. కర్ణాటకలో 25 సీట్లు గెలుచుకోవడమే కాదు.. తెలంగాణలో ఈ సంఖ్యను 4 నుంచి ఇంకా పెంచుకుంటామని చెబుతున్నది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ బోణీ కొట్టేందుకు బలమైన ప్రయత్నాలు చేస్తున్నది.
PM Modi: కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ అన్ని రకాల అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. వ్యూహ ప్రతివ్యూహాలనూ రెడీ చేసుకుంది. ఈ సారి దక్షిణాదిలోనూ మంచి ప్రదర్శన కనబరచాలని లక్ష్యం పెట్టుకుంది. ఇది వరకు ఖాతా తెరవని రాష్ట్రాల్లోనూ ఈ సారి బోణీ కొట్టాలని బలంగా అనుకుంటున్నది. కనీసం 40 నుంచి 50 సీట్లను దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల నుంచి రాబట్టుకోవాలని ప్లాన్ వేస్తున్నది. ఇందుకోసం ప్రచారాలు, అభివృద్ధి ప్రాజెక్టులను, ప్రకటనలను సిద్ధం చేసుకుంటున్నది. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ సారి సౌత్ పైనా ఎక్కువ ఫోకస్ పెట్టనున్నారు. వారి పర్యటనలు, రోడ్ షోలు, సభలు ఎక్కువగా ఉండనున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లోని మొత్తం 129 లోక్ సభ స్థానాల్లో బీజేపీకి కేవలం 29 మాత్రమే ఉన్నాయి. అందులో 25 మంది ఎంపీలు కర్ణాటక నుంచే ఉన్నారు. మొన్నటి వరకు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాలు తెలంగాణలో దక్కించుకుంది. ఇక తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ ఖాతా తెరవలేదు.
అయినా.. ఈ సారి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపీ సీట్లను పెంచుకోవాలని బీజేపీ అనుకుంటున్నది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ మంగళవారం తమిళనాడు చేరారు. అక్కడ ఎయిర్‌పోర్టు సహా రూ.20 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. ఈ రోజు కేరళకు వెళ్లారు. త్రిస్సూర్‌లో మహిళా కార్యకర్తలతో భారీ రోడ్ షో నిర్వహించారు. సుమారు రెండు లక్షల బీజేపీ మహిళా కార్యకర్తలు ఇందుకు హాజరైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దక్షిణాదిలో బీజేపీకి ఉనికే లేదని కాంగ్రెస్ విమర్శించిన తర్వాత బీజేపీ చేసిన ప్రధాన ప్రకటన ఇది.
Also Read: GruhaLaxmi: గృహలక్ష్మీ పథకం కింద ఇల్లు మంజూరైన వారి పరిస్థితి ఏమిటీ? రేవంత్ సర్కారు ఆదేశాలివే
ఓ సీనియర్ బీజేపీ నేత ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాదిలో 40 నుంచి 50 సీట్లు గెలుచుకోవడమే మా లక్ష్యం. కర్ణాటకలో మళ్లీ 25 సీట్లు గెలుచుకుంటాం. సిద్ధరామయ్యపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. మా ఓటు షేర్ బలంగానే ఉన్నది. తెలంగాణలో 2019 కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. కేరళ, తమిళనాడు, ఏపీలోనూ ఎంపీ సీట్లను గెలుస్తామని అనుకుంటున్నాం.
ఏఐఏడీఎంకే పొత్తు నుంచి బయటకు వెళ్లడంతో బీజేపీ తమిళనాడులో ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగుతున్నది. ఏఐఏడీఎంకే ఎంత అభ్యంతరం తెలిపినా తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామళైని తప్పించలేదు. కేరళలోనూ అటు లెఫ్ట్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతున్నది. కేరళలో వయానాడ్‌లో రాహుల్ గాంధీపై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నది.
తెలంగాణలో బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించడంతో పార్టీ కొంత నష్టపడిందని చెబుతారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి బలహీనపడిందని, కాబట్టి, ఇక్కడ ఫైట్ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని, ఫలితంగా తాము ఎక్కువ మంది ఎంపీలను గెలుచుకుంటామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.