ఎన్నో ఏళ్ల పోరాటం , నిరీక్షణ ఫలించి రామజన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమవుతోంది. ఎప్పుడెప్పుడు రాములోరిని దర్శించుకుందామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. జనవరి 22ని రాష్ట్రవ్యాప్తంగా డ్రై డేగా పాటిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు.
ఎన్నో ఏళ్ల పోరాటం , నిరీక్షణ ఫలించి రామజన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమవుతోంది. ఎప్పుడెప్పుడు రాములోరిని దర్శించుకుందామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. దీనికి తగినట్లుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 22ని రాష్ట్రవ్యాప్తంగా డ్రై డేగా పాటిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. ఈ నిర్ణయం అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించడంతో సమానంగా వుంటుందన్నారు.
ఛత్తీసగఢ్‌లో రాముడితో అనుబంధం కలిగి వుండటం అదృష్టమని.. ఈ రాష్ట్రాన్ని నానిహాల్ (తల్లి తరపున తాతల ఇల్లు)గా భక్తులు విశ్వసిస్తారని సీఎం చెప్పారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 300 మెట్రిక్ టన్నుల సుగంధ బియ్యాన్ని అయోధ్యకు పంపిందని విష్ణుదేవ్ తెలిపారు. దీపావళి మాదిరిగానే రాష్ట్రంలో ఆ రోజును పండుగ వాతావరణంతో జరుపుకుంటామని సాయ్ అన్నారు. రాముడు తన 14 ఏళ్ల వనవాస సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని అనేక ప్రాంతాల గుండా వెళ్లినట్లు పరిశోధనలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ముఖ్యంగా రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో వున్న చంద్‌ఖూరి గ్రామం రాముడి తల్లి కౌసల్య జన్మస్థలమని ఎంతోమంది విశ్వసిస్తారు. పవిత్రోత్సవం తరువాత జనవరి 25 నుంచి మార్చి 25 వరకు రామమందిరాన్ని సందర్శించడంలో భక్తులకు తమ కార్యకర్తలు సహాయం చేస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), దాని అనుబంధ సంస్థలు సైతం దేశవ్యాప్తంగా 15 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించాయి. వేడుకల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహించడానికి పబ్లిక్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లకు పిలుపునిచ్చాయి.
జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలు ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ , దాని పొరుగు రాష్ట్రాలోని బీజేపీ యూనిట్లు సైతం రామమందిరాన్ని సందర్శించే వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. సీనియర్ నేతలతో కూడిన కమిటీ ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ ఏర్పాట్లను సమన్వయం చేస్తోంది.