దేశంలో కరోనా విజృంభణ.. రేపు సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం, లాక్‌డౌన్ వుంటుందా..?

By Siva KodatiFirst Published Jan 12, 2022, 9:44 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వర్చువల్ ద్వారా జరిగే ఈ సమావేశంలో కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్, తదితర విషయాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. 

దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌ల కంటే వేగంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నరకు చేరిందంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. అగ్నికి ఆజ్యం పోసినట్లు కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. ఒమిక్రాన్ (Omicron) కేసులు సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి. పరిస్ధితులు దిగజారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆదివారం సాయంత్రం వైద్యనిపుణులు, మంత్రులతో సైతం సమీక్ష నిర్వహించారు. 

థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ సూచనలు చేశారు. భారీగా పెరుగుతున్న కరోనా (Coronavirus) కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, ఆక్సిజన్ తదితర అంశాలపై చర్చించారు.జిల్లా స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని.. యుక్తవయస్సులోని పిల్లలకు టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వర్చువల్ ద్వారా జరిగే ఈ సమావేశంలో కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్, తదితర విషయాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో అనేక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి భేటీలో ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు దేశంలో కరోనా కేసుల (corona cases) సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,720 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కిందటి రోజు కరోనాతో 277 మంది మృతిచెందగా.. గత 24 గంటల్లో కరోనాతో 442 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశం ఇప్పటివరకు మహమ్మారితో మృతిచెందిన వారి సంఖ్య 4,84,655కి పెరిగింది. నిన్న దేశంలో కరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,46,30,536కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,55,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. అదే సమయంలో వీక్లీ పాజిటివిటీ రేటు 9.82 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 85,26,240 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,53,80,08,200కి చేరింది. దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందివ్వడంతో పాటుగా, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. 

click me!