Republic Day:మోదీని అడ్డుకుంటే రివార్డు.. రిపబ్లిక్ డేను లక్ష్యంగా చేసుకుని ఖలిస్తానీ ఉగ్రసంస్థ బెదిరింపులు

By Sumanth KanukulaFirst Published Jan 12, 2022, 6:51 PM IST
Highlights

ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (Sikhs For Justice) మరోసారి భారతదేశంలో రిపబ్లిక్ డే (జనవరి 26) వేడుకలను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న త్రివర్ణ పతాకానికి ఎగరవేసేవారికి రివార్డు ప్రకటించింది.

ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (Sikhs For Justice) మరోసారి భారతదేశంలో రిపబ్లిక్ డే (జనవరి 26) వేడుకలను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న త్రివర్ణ పతాకానికి బదులు ఖలిస్తానీ జెండాను ఎగురవేస్తామని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మార్గాన్ని అడ్డుకోవాలని, జనవరి 26న దేశ రాజధాని నుంచి త్రివర్ణ పతాకాన్ని తొలగించాలని దాని మద్దతుదారులను కోరింది. ఖలిస్తానీ ఎజెండాను (Khalistani agenda) ముందుకు తీసుకెళ్లేందుకు రివార్డులను ప్రకటించింది. 

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో భారత త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్తానీ జెండాలను ఎగురవేసే ఎవరికైనా ఒక మిలియన్ డాలర్ల రివార్డును బహుమతిగా అందజేస్తామని ప్రకటన చేసింది. ఈ విధంగా రివార్డులు ప్రకటించడం ద్వారా న్యూఢిల్లీలో శాంతియుత కార్యకలాపాలకు విఘాతం కలిగించేందుకు నిషేధిత ఉగ్ర సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. 

 

ये है खालिस्तानी कार्टून पन्नू। 😡 pic.twitter.com/jYbVsapLLY

— Ajay Sehrawat (@IamAjaySehrawat)

ఈ వీడియోను ఎస్‌ఎఫ్‌జే చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇందులో రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో భారత త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్తానీ జెండాను ఎగురవేసేవారికి 1 మిలియన్ డాలర్ల "రివార్డ్" ఇస్తామని నిషేధిత సంస్థ ప్రకటించారు. ఈ వీడియోను ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ సెహ్రావత్ ట్విట్టర్‌లో షేర్ చేసి.. ఇది ఖలీస్తానీల తీరు అని మండిపడ్డారు. 

ఇక, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించికుంది. మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనని సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి తమకు ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తెలిపింది. మోదీ కాన్వాయ్ రోడ్డుపై నిలిచిపోవడానికి కారణం తామేనని, భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, ఈ ఘటనపై ఓ ఎన్‌జీవో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపవద్దని న్యాయవాదులను బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. న్యాయవాదుల సంఘం పేర్కొన్న ప్రకారం.. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిన్న ఉదయం 10.40 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 12.36 గంటలకు మరోసారి రికార్డెడ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. మోదీ కాన్వాయన్‌ను అడ్డుకోవడం వెనక ఉన్నది తామేనని అందులో వారు అంగీకరించారు.

ఇకపోతే... ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫల్యంపై (PM Modi Security lapse) విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు (supreme court) బుధవారం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు ఈరోజు తెలిపింది. ఈ విచారణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, పంజాబ్ పోలీసులు విచారణలో భాగం కానున్నారని వెల్లడించింది.   

ఈ కమిటీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, చంఢీఘర్ పోలీస్ చీఫ్, డైరెక్టర్ జనరల్‌ (సెక్యూరిటీ) ఆఫ్ పంజాబ్, పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉండనున్నారు. "ఈ ప్రశ్నలను ఏ ఒక్క పక్షం విచారణపై వదిలిపెట్టలేము. మాకు స్వతంత్ర దర్యాప్తు అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది.

జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని విచారణ కమిటీ.. భద్రతా ఉల్లంఘనకు కారణమేమిటో, ఎవరు బాధ్యులు, భవిష్యత్తులో ఇటువంటి లోపాలను నివారించడానికి ఎలాంటి రక్షణలు అవసరమో విచారించి.. నివేదికను వీలైనంత త్వరగా సమర్పిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనపై (PM Modi Security Lapse) విచారణ చేపట్టాలని కోరుతూ లాయర్స్ వాయిస్ (Lawyers Voice) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఈ  ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతన్న అన్ని విచారణలను నిలిపివేయాలని కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలను సోమవారం ఆదేశించింది. ఈ ఘటనపై విచారణకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో  కమిటీని నియమించింది. 

click me!