ముగిసిన ప్రధాని మోడీ విదేశీ పర్యటన : వచ్చి రాగానే ఢిల్లీ ఎల్జీతో భేటీ , యమునా వరదలపై ఆరా

Siva Kodati |  
Published : Jul 15, 2023, 10:15 PM IST
ముగిసిన ప్రధాని మోడీ విదేశీ పర్యటన : వచ్చి రాగానే ఢిల్లీ ఎల్జీతో భేటీ , యమునా వరదలపై ఆరా

సారాంశం

మూడు రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చి రాగానే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యమునా నది వరదలపై ఆయన ఆరా తీశారు. 

యమునా నది పోటెత్తడంతో దేశ రాజధాని ఢిల్లీ చివురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతూ వుండటంతో యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నాలుగు దశాబ్ధాల తర్వాత యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లోకి వరద నీరు చేసింది. ఐటీవో, శాంతి వన్ ప్రాంతం, ఆదాయపు పన్ను కార్యాలయం, ఇతర కీలక ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి.

 

 

విదేశీ పర్యటనలో వున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు ఢిల్లీ వరద పరిస్ధితులపై ఆరా తీస్తూనే వున్నారు. తాజగా యూఏఈ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న మోడీ.. వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాతో మాట్లాడారు. వరద పరిస్థితి, పునరావాస చర్యలు, బాధితుల తరలింపు వంటి చర్యలపై ఆరా తీశారు. అంతకుముందు ప్రధాని మోడీ మూడు రోజుల పాటు విదేశాల్లో పర్యటించారు. ఫ్రాన్స్, యూఏఈలో పర్యటించిన ఆయన పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

కాగా.. శుక్రవారం రాత్రి 11 గంటలకు యమునా నీటిమట్టం 207.98 మీటర్లుగా నమోదైంది. యమునా నీటి మట్టం తగ్గడంతో.. గురువారం మూసివేసిన ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాన్ని తెరిచారు. ఓఖ్లా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను పునఃప్రారంభించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. శనివారం ఉదయం నాటికి యమునా నది నీటిమట్టాలు 207.7 మీటర్లకు తగ్గితే.. వజీరాబాద్‌, చంద్రవాల్‌లోని మరో రెండు నీటి శుద్ధి ప్లాంట్లను కూడా పునఃప్రారంభిస్తామని చెప్పారు. 

అయితే యమునా నదిలో నీటిమట్టం స్వల్పంగా తగ్గడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ.. వాతావరణ శాఖ వర్ష సూచన ఉన్నట్టుగా ప్రకటించడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో భారీ వర్షాలు, వరదల నుంచి ఇప్పటికిప్పుడు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.  

ఐటీవో, రాజ్‌ఘాట్‌తో సహా సెంట్రల్ ఢిల్లీలోని కీలక ప్రాంతాలు నీటిలో మునిగిపోవడంతో సైన్యం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్)ని రంగంలోకి దించారు. హనుమాన్ మందిర్, యమునా బజార్, గీతాకాలనీ, సివిల్ లైన్స్ వెలుపల ఉన్న రహదారులు కూడా నీటితో నిండిపోయాయి. నిగమ్ బోద్ ఘాట్‌తో సహా ఢిల్లీలోని సుప్రీంకోర్టు, కొన్ని శ్మశానవాటికలకు కూడా వరద నీరు చేరుకుంది. ఢిల్లీలో వర్షాలు కురవకపోతే రెండు రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని.. అయితే వర్షాలు కురిస్తే మరికొంత సమయం పట్టవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?