
Cheetahs : కునో నేషనల్ పార్కులో ఇటీవల జరిగిన చిరుతల మరణాలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందనీ, వాటిని మధ్యప్రదేశ్ వెలుపలకు తరలించబోమని కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ శనివారం తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల చిరుతల మరణాలపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిరుతల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామనీ, దీనిపై అంతర్జాతీయ నిపుణులు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు.
"మా బృందం మొత్తం ఏర్పాట్లను పరిశీలిస్తోంది. చిరుతల కోసం అన్ని పరీక్షిస్తోంది.. సమీక్ష జరుగుతోంది. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులను కూడా రంగంలోకి దింపారు. చిరుతలను బాగా చూసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా బృందం కునోను కూడా సందర్శిస్తుంది. గతంలోనూ ఏర్పాట్లను సమీక్షించాం. అన్ని ఆందోళనలు మాకు తెలుసు, కానీ చీతాలను మధ్యప్రదేశ్ నుండి తరలించరు" అని కేంద్ర అటవీ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు.
అంతకుముందు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాట్లాడుతూ, చిరుతల మరణాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికను రూపొందించలేదని అన్నారు. శుక్రవారం కునోలో సూరజ్ అనే మరో చిరుత మృతి చెందడంపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ట్విటర్ లో స్పందిస్తూ.. "కునో నేషనల్ పార్క్ లో ఎనిమిదో చిరుత మరణ వార్త ఈ రోజు అందింది. చిరుతలు వరుసగా మృత్యువాత పడుతున్నా, ఈ వన్యప్రాణుల ప్రాణాలను కాపాడేందుకు ఎలాంటి చొరవ తీసుకోకపోవడం గమనార్హం" అంటూ పేర్కొన్నారు.
అలాగే, "వన్యప్రాణులను రాజకీయ ప్రదర్శనలకు ఆరాధ్య వస్తువుగా మార్చడం ప్రజాస్వామ్య ప్రజాప్రతినిధులకు తగదన్నారు. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలతో చర్చించి, వాటి ద్వారా ఈ జీవుల ప్రాణాలను కాపాడేందుకు బాధ్యతాయుతమైన వ్యక్తులు వెంటనే ఇలాంటి ప్రణాళికను రూపొందించాలని కోరుతున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు. శుక్రవారం మృతి చెందిన చిరుత మృతికి గల కారణాలు పోస్టుమార్టం తర్వాత తెలుస్తాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ తెలిపారు.
కునోలో సూరజ్ అనే మరో మగ చిరుత మృతి చెందిందనీ, దీంతో మృతుల సంఖ్య 8కి చేరిందని చౌహాన్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మరణానికి గల కారణాలు తెలుస్తాయి. ఇలాంటి ప్రాజెక్టుల్లో తరచూ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలు సహజంగా జరుగుతుంటే మనం భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.