2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ ఈసారి ఒంటరిగానే 370 సీట్లు దాటుతుందని జోస్యం చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే ఒక్కో బూత్‌లో అదనంగా 370 ఓట్లు వచ్చేలా చూడాలని, బీజేపీకి 370 లోక్‌సభ స్థానాలు దక్కేలా చూడాలని మోడీ ఓటర్లకు పిలుపునిచ్చారు.
2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. బీజేపీ ఈసారి ఒంటరిగానే 370 సీట్లు దాటుతుందని జోస్యం చెప్పారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఖాయమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజల కోసం 24 x 7 కష్టపడతామని.. ఎన్డీయే కూటమికి 400 సీట్ల పైనే వస్తాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గిరిజనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడమే కాదు, వారిని అవమానపరిచిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ దుస్ధితికి కాంగ్రెస్సే కారణమని.. గిరిజనులంటే కాంగ్రెస్‌కు చిన్న చూపని మోడీ దుయ్యబట్టారు. గిరిజనులను కాంగ్రెస్ ఓటు బ్యాంకులా మాత్రమే వాడుకుంటోందని ఆయన ఫైర్ అయ్యారు. గత ఎన్నికలతో పోల్చితే ఒక్కో బూత్‌లో అదనంగా 370 ఓట్లు వచ్చేలా చూడాలని, బీజేపీకి 370 లోక్‌సభ స్థానాలు దక్కేలా చూడాలని మోడీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకి గిరిజన సంఘం ఓటు బ్యాంక్ కాదని.. వారు మనదేశానికి గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు.
కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా గిరిజన వర్గాలకు ఆరు లోక్‌సభ స్థానాలు రిజర్వ్ చేయబడిన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా మోడీ ప్రసంగించారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో ఆధార్ అనుదాన్ యోజన కింద దాదాపు 2 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు నెలవారీ వాయిదాల పంపిణీ కూడా వుంది.
మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నీటి సదుపాయం , మౌలిక వసతులను పెంపొందించే లక్ష్యంతో వివిధ నీటి సరఫరా ప్రాజెక్ట్‌లు , పట్టణ పరివర్తన పథకాలకు మోడీ శంకుస్థాపన చేశారు. అదనంగా పీఎం మోడీ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను , విద్యాసంస్థలను సైతం ప్రధాని ప్రారంభించారు. ఇందులో తాంత్యా మామా భిల్ యూనివర్సిటీ, సీఎం రైజ్ స్కూల్ వంటివి వున్నాయి. అట్టడుగు వర్గాల సాధికారత, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కింద గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధానమంత్రి నిధులు కేటాయించారు.