
ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ (narendra modi) ప్రభుత్వానికి అత్యంత ప్రజాదరణ లభించిన పథకాల్లో స్వచ్ఛ భారత్ ఒకటి (swachh bharat) . పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం దేశంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలు పట్ల మోదీ సర్కారు కూడా శ్రద్ధ పెట్టింది. ఈ పథకానికి మోదీ ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయానికి నిదర్శనంగా ఆదివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో రూ.920 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌ను (pragati maidan integrated project) ప్రారంభించేందుకు ఈరోజు ఉదయం ప్రధాని మోడీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆయన కలియ తిరిగారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తూ, మంత్రులు, అధికారులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కొత్త నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఒంటరిగా కారిడార్‌లోకి ప్రవేశించిన మోదీ... అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను స్వయంగా తన చేతులతో ఏరి పక్కన పడేశారు. ఆ తర్వాత అటుగా నడుస్తుండగా.. పక్కన పడిన ఓ కూల్ డ్రింక్ బాటిల్‌ను కూడా మోదీ తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు, బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే.. ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ విషయానికి వస్తే 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం గుండా తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ నుంచి ఇండియా గేట్, ఇతర సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాలకు ప్రజలు సులభంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఇకపై ITO, మథుర రోడ్, భైరాన్ మార్గ్‌ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు తెరపడినట్లే.