
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆ తీర్మానంలో కోరింది. ప్రజా ప్రయోజనాలను, యువత భవిష్యత్, స్పూర్తిని దృష్టిలో ఉంచుకుని దీనిని ఉప సంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలని కోరింది.
Agnipath : బీజేపీ, జేడీ (యూ) పోరులో బీహార్ కాలిపోతోంది - ప్రశాంత్ కిషోర్
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన, ఆయన నివాసంలో జరిగిన కేబినేట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యం ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలున్నదని, అద్వితీయ ధైర్యానికి పేరుగాంచిందని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ‘‘ భారత సైన్యాన్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది. భారత సైన్యం గౌరవం, ప్రతిష్టను కాపాడుకోవడానికి, దళాలలో నైపుణ్యం, అనుభవం స్థిరత్వం అవసరం. ఆర్మీలో సామర్థ్యాన్ని పెంచడానికి, స్వల్పకాలిక రిక్రూట్‌లకు బదులుగా శాశ్వత సైనికులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీని వల్ల దేశం మొత్తం వారి అనుభవాన్ని పొందగలదు. సైన్యం అన్ని వనరులను కలిగి ఉండాలి. నిరంతరం బలోపేతం చేయాలి ’’ అని సమావేశం అనంతరం రాజస్థాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
అగ్నిపథ్ నిబంధనలకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు కేంద్ర ప్రభుత్వం అనేక మంది నిపుణులతో సమగ్రంగా చర్చించి ఉండాల్సిందని రాజస్థాన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. “ అగ్నిపథ్ పథకం యువకుల భవిష్యత్తును సురక్షితం చేయదని లేదా దేశ సైన్యం పూర్తి విశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోదని చాలా మంది సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ జరగాలని నిపుణులు అంటున్నారు. సైన్యం, మెరుగైన శిక్షణతో పాటు సైనికులు అన్ని ప్రయోజనాలను పొందాలి, దీని వల్ల వారి భవిష్యత్తు, వారి కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది ” అని ఆ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా అగ్నిపథ్ పై ఇంకా కొన్ని రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల కిందట ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్‌లలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటు మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్‌లో విస్తరించి ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగాలలో అగ్నివీర్ లకు 10 శాతం కోటా ఉంటుందని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఇది అదనంగా ఉంటుంది. కాగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు పోలీసు ఉద్యోగాల్లో ప్రియారిటీ ఇస్తామని ప్రకటించాయి.