
ఇకపై అగ్నిపథ్ (agnipath) ద్వారానే త్రివిధ దళాల్లో అన్ని నియామకాలు జరుగుతాయని రక్షణ శాఖ (ministry of defence) స్పష్టం చేసింది. త్రివిధ దళాల్లో రెగ్యులర్ నియామకాలు వుండబోవని తెలిపాయి. గతంలో రెండు పరీక్షలు పూర్తి చేసిన వారు కూడా అగ్నిపథ్ ద్వారానే త్రివిధ దళాల్లో చేరాల్సి వుంటుందని స్పష్టత నిచ్చాయి. ఇటీవల చోటు చేసుకున్న ఆందోళనల నేపథ్యంలో అగ్నిపథ్‌పై కేంద్రం వైఖరి ఎలా వుండబోతోందన్న ఆసక్తి నెలకొంది. అయితే అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. అంతేకాదు .. తాము రిజర్వేషన్లు ప్రకటించింది కూడా తాము విధ్వంసాన్ని చూసి భయపడి కాదని తెలిపారు త్రివిధ దళాల ప్రతినిధులు.
అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలటరీ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీ అనిల్ పురి. ఇకపై త్రివిధ దళాల్లో అగ్నిపథ్ ద్వారానే నియామకాలు వుంటాయన్నారు. ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్‌మెంట్‌కు జూలై 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 83 ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆర్మీలో చేరే వారికి క్రమశిక్షణ ముఖ్యమని ఆయన అన్నారు. విధ్వంసానికి పాల్పడే వారికి ఆర్మీలో చోటు లేదని అనిల్ పురి స్పష్టం చేశారు. క్రమశిక్షణ తప్పినవారు జవాన్లుగా అనర్హులన్నారు.
ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్‌ల నియామకం చేపడుతున్నామని... వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్‌మెంట్ సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతామని.. భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందని అనిల్ పురి పేర్కొన్నారు. అగ్నివీర్‌లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయని.. అయితే ఆందోళనలకు ముందే ఈ నిర‍్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఈ నెల 24 నుంచి తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్-1 ఆన్‌లైన్ టెస్టు ఉంటుంది. డిసెంబర్ 30 నాటికి తొలిబ్యాచ్ ట్రైనింగ్‌కు వెళ్తారని వారు తెలిపారు.
అగ్నివీర్‌లకు ఇచ్చే అలవెన్సుల్లో ఎలాంటి తేడాలు వుండవని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టం చేశారు. పాతికేళ్ల వయసులో ఆర్మీ నుంచి బయటకొస్తే వాళ్లకు నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని ఆయన అన్నారు. ఒకవేళ అగ్నివీర్‌లు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి పరిహారం అందుతుందని అనిల్ పురి చెప్పారు. సర్వీసు నిబంధనల్లో అగ్నివీర్‌ల విషయంలో వివక్ష వుండదని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్ల తర్వాత కొనసాగాలా వద్దా అనేది యువత ఇష్టమని.. నాలుగేళ్ల తర్వాత డిప్లొమా ధ్రువపత్రం ఇస్తామని అనిల్ పురి వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత కూడా యువతకు అనేక రంగాల్లో అవకాశాలు వుంటాయని ఆయన పేర్కొన్నారు.
పాతికేళ్ల తర్వాత ఆర్మీ నుంచి బయటకు వచ్చే వాళ్లకు బ్రిడ్జి కోర్సులో శిక్సణ ఇస్తామని అనిల్ పురి వెల్లడించారు. అగ్నిపథ్ సర్వీసును పూర్తి చేసిన వాళ్లు పోలీస్ ఉద్యోగాలకు అర్హులని ఆయన తెలిపారు. పోలీస్ విభాగంలోకి తీసుకోవడానికి 4 రాష్ట్రాలు సిద్ధంగా వున్నాయని.. అగ్నివీరులు ఎంతగానో ఉపయోగపడతారని సీఐఐ స్పష్టం చేసిందని అనిల్ పురి గుర్తుచేశారు.