
విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అడుగుపెట్టే ప్రపంచం వేగంగా మారుతోందని మోదీ అన్నారు. సాంకేతిక రంగంతో పాటు దాదాపు అన్ని రంగాల్లో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేథస్సు, ఆధునిక సాంకేతికత వంటి అంశాలు భవిష్యత్తును మరింతగా ప్రభావితం చేయనున్నాయని సూచించారు. రాబోయే రెండు, మూడు దశాబ్దాల్లో ప్రపంచం ఎలా మారుతుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని అన్నారు. అందుకే విద్యార్థులు ఒకసారి చదువు పూర్తయిందని భావించకుండా జీవితాంతం కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. ఎప్పుడూ ఆసక్తిని కొనసాగిస్తూ, కొత్త విషయాలను తెలుసుకునే అలవాటు ఉన్నవారే మారుతున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్లగలరని చెప్పారు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక సవాలుగా మాత్రమే చూడకూడదని ప్రధాని సూచించారు. సమస్యల వెనుక కొత్త అవకాశాలు కూడా దాగి ఉంటాయని చెప్పారు. పెద్ద సమస్య ఎదురైనప్పుడు దానిని చూసి ఆందోళన చెందకుండా, దాన్ని చిన్న చిన్న అంశాలుగా విభజించి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. కేవలం సమస్యను గుర్తించడం లేదా దానిపై ప్రశ్నలు లేవనెత్తడం సరిపోదని మోదీ అన్నారు. దానికి ఆచరణ సాధ్యమైన పరిష్కారం కనుగొనే ఆలోచనా విధానాన్ని యువత అలవర్చుకోవాలని సూచించారు. సవాళ్లను అవకాశాలుగా మార్చే సామర్థ్యమే భవిష్యత్తులో విజయాన్ని అందిస్తుందని చెప్పారు.
ప్రతి తరానికి దేశం పట్ల కొన్ని బాధ్యతలు ఉంటాయని మోదీ పేర్కొన్నారు. యువత తమ వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు దేశ ప్రగతి గురించి కూడా ఆలోచించాలని పిలుపునిచ్చారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయాణంలో యువత ప్రత్యక్ష భాగస్వాములుగా మారాల్సిన అవసరం ఉందన్నారు.
రాబోయే 30 నుంచి 35 ఏళ్ల కాలంలో యువత తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ప్రధాని చెప్పారు. తాము ఎంచుకునే విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర రంగాల ద్వారా దేశానికి ఏ విధంగా ఉపయోగపడగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు తమ ప్రతిభను ఎలా ఉపయోగించాలనే ప్రశ్నను యువత తమకు తామే వేసుకోవాలని అన్నారు.
స్నాతకోత్సవంలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు మోదీ స్వర్ణ పతకాలను అందజేశారు. దీన్‌దయాల్ శర్మ స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం వంటి పురస్కారాలను విద్యార్థులకు ప్రదానం చేశారు. అయితే అవార్డులు అందుకున్న వారిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండటాన్ని మోదీ ప్రస్తావించారు. మరింత మంది మహిళా విద్యార్థులు కూడా ఇలాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఐఐటీ దిల్లీ సోనిపత్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటింగ్ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలు, కృత్రిమ మేథస్సు ఆధారిత ప్రాజెక్టులకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం సిద్ధం కాకుండా దేశానికి ఉపయోగపడే ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని మోదీ సందేశం ఇచ్చారు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని యువతకు పిలుపునిచ్చారు.