
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ, ముంబయిలను కలిపే ఎక్స్‌ప్రెస్‌వేను రాజస్తాన్‌లో ఈ రోజు ప్రారంభించారు. 1,400 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్ వే తొలి ఫేజ్‌ను ఆయన ప్రారంభించి రాజస్తాన్‌లోని దౌసాలో మాట్లాడారు. ఢిల్లీ నుంచి దౌసా నుంచి లాల్‌సోట్ మధ్య ఎక్స్‌ప్రెస్ వే.. ఢిల్లీ నుంచి జైపూర్‌కు మధ్యగల దూరాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఈ ప్రయాణం ఇప్పటి వరకు ఐదు గంటలు పడితే.. అది మూడున్నర గంటలకు తగ్గిపోనుంది. ఇది ఈ రీజియన్‌లో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించనుంది.
రాజస్తాన్‌లోని దౌసాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులు మరిన్ని పెట్టుబడులను తెస్తాయని అనేక అధ్యయనాలు తేల్చాయని అన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే సూత్రం దేశం కోసం పాటిస్తున్నామని, తద్వార సమర్థ భారత్‌ను రూపొందిస్తున్నామని ప్రధాని అన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే అభివృద్ధి చెందుతున్న భారత దేశానికి నిదర్శనం అని వివరించారు.
మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడులు చిన్న చిన్న వ్యాపారులకు, పరిశ్రమలకు, షాపు యజమానులకు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. హైవే ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీలు వంటివి వారికి ఎంతో శక్తిని సమకూర్చి పెడతాయని వివరించారు. ఇప్పుడు ఢిల్లీలో పని చేసుకుని మళ్లీ సాయంత్రానికల్లా రాజస్తాన్‌లోని తమ ఇంటికి ప్రజలు తిరిగి వచ్చేయవచ్చని అన్నారు.
రాజస్తాన్ ఇప్పటికే టూరిస్టులకు గమ్యస్థానం అని వివరించారు. సరిస్కా నేషనల్ పార్క్, కిలడియో నేషనల్ పార్క్, రణథంబోర్ నేషనల్ పార్క్‌లు, జైపూర్, అజ్మేర్ వంటి నగరాలతో రాజస్తాన్ చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని తెలిపారు. ఇప్పడు ఈ కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మరింత మందిని ఆకర్షిస్తాయని వివరించారు.
Also Read: ప్రభుత్వ భూమిని ఆక్రమించావ్.. : హనుమంతుడికి రైల్వే శాఖ నోటీసులు
మౌలిక సదుపాయాలపై పెట్టే పెట్టుబడులు మరిన్ని పెట్టుబడులను ఆకర్షి స్తాయని ప్రధాని అన్నారు. అందుకే గడిచిన 9 ఏళ్లలో తాము ఎంతో పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై పెట్టుబడులు పెట్టామని వివరించారు. తమ ప్రభుత్వం రాజస్తాన్‌కు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు అందించిందని తెలిపారు.
ఢిల్లీ నుంచి ముంబయికి నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే పొడవు 264 కిలోమీటర్లు. దీని కోసం కేంద్ర ప్రభు్తవం సుమారు రూ. 12,150 కోట్ల నిధులను ఖర్చు పెట్టింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్,మహారాష్ట్రలను కలుపుతూ వెళ్లుతుంది.