
కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. కేంద్రంలో అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల స్థితిని ప్రధాని మోదీ సమీక్షించారు. రాబోయే ఏడాదిన్నరలో 10 లక్షల మందిని ప్రభుత్వం మిషన్ మోడ్‌లో నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది.
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీ చేయడం ద్వారా వారి విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రచిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు భారీగా ఉద్యోగాల భర్తీ చేపడితే.. రాజకీయంగా కూడా మోదీకి కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.