ప్రధాని మోదీ, లెక్స్ ఫ్రీడ్‌మన్‌తో తన జీవితం, ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర, గుజరాత్ అల్లర్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఈ పాడ్‌కాస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కృత్రిమ మేధస్సు, టెక్నాలజీ, ఫిలాసఫీపై లోతైన చర్చలకు పేరుగాంచిన అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రీడ్‌మన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మూడు గంటలపాటు మాట్లాడారు.
ఈ పాడ్‌కాస్ట్ గురించి ఎక్స్ వేదికగా లెక్స్ ఫ్రీడ్‌మన్ ప్రకటిస్తూ, "ఇది నా జీవితంలోనే చాలా శక్తివంతమైన సంభాషణల్లో ఒకటి" అని అన్నారు. ఈ ఎపిసోడ్ ఈరోజు (మార్చి 16) విడుదల కానుంది.
ఈ చర్చకు సంబంధించిన ప్రోమోను ప్రధాని మోదీ పంచుకున్నారు. "లెక్స్ ఫ్రీడ్‌మన్‌తో మాట్లాడటం చాలా ఆసక్తికరంగా ఉంది. నా చిన్ననాటి రోజులు, హిమాలయాల్లో గడిపిన సమయం, ప్రజల్లో నేను సాగించిన ప్రయాణం వంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడాను!" అని ప్రధాని పేర్కొన్నారు.
లెక్స్ ఫ్రీడ్‌మన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని తన జీవితంలో ఆర్‌ఎస్‌ఎస్ పోషించిన పాత్ర, సమాజానికి దాని సాయం గురించి చాలా వివరంగా చెప్పారు. 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అల్లర్ల గురించి కూడా వివరించారు. ఆ సమయంలో జరిగిన విషయాలను చెబుతూ, తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.
I had an epic 3-hour podcast conversation with , Prime Minister of India.
It was one of the most powerful conversations of my life.
It'll be out tomorrow. pic.twitter.com/KmRSFfVRKg
ఎవరీ లెక్స్ ఫ్రీడ్‌మన్?
లెక్స్ ఫ్రీడ్‌మన్ ఒక AI పరిశోధకుడు, పాడ్‌కాస్టర్. ఈయన తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లోని చకలోవ్స్క్‌లో జన్మించారు. ఆ తర్వాత మాస్కోకు వెళ్లారు. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత, 11 ఏళ్ల వయసులో ఆయన కుటుంబం చికాగోకు మారింది.
ఫ్రీడ్‌మన్ డ్రెక్షెల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. 2010లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు. 2014లో అదే యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
2014లో గూగుల్ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, అక్కడ AI-ఆధారిత విభాగంలో పనిచేశారు. ఏడాది తర్వాత గూగుల్ నుంచి బయటకు వచ్చారు. 2015లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరారు. ఆ పదవిలో ఆయన ఇంకా కొనసాగుతున్నారు.
లెక్స్ ఫ్రీడ్‌మన్ మంచి మార్షల్ ఆర్టిస్ట్ కూడా. బ్రెజిలియన్ జ్యూ-జిట్సులో ఫస్ట్-డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించారు.