
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించింది. ఉక్రెయిన్ కూడా ప్రతిదాడి మొదలుపెట్టింది. అయితే, ఈ దాడులు పరిమిత స్థాయిలోనే జరుగుతున్నట్టు తెలుస్తున్నది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడాన్ని రష్యా అంగీకరించడం లేదు. దాని పర్యవసానంగా యుద్ధం మొదలైనట్టు చర్చిస్తున్నారు. ఉక్రెయిన్ అణువణువు ఉద్రిక్తంగా ఉన్నది. ఎక్కడ క్షిపణి వచ్చి పడి ధ్వంసం చేస్తుందో తెలియని విధంగా ఉన్నది. ఉన్నట్టుండి ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదంలో అక్కడి ప్రజలు ఉన్నారు. పరిస్థితులు మరింత దిగజారక ముందే రష్యాకు ముకుతాడు వేయడంపై ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఆ దేశం భారత్‌ను ఆశ్రయించింది.
రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధాలు ఉన్నాయని, రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రరూపం దాల్చకుండా నియంత్రించడంలో ఇండియా ప్రముఖ పాత్ర పోషించవచ్చు అని భారత్‌కు ఉక్రెయిన్ అంబాసిడర్ ఇగోర్ పొలిఖా తెలిపారు. కాబట్టి, ఈ సంక్షోభాన్ని నిలువరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమ దేశం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడైమిర్ జెలెన్‌స్కీలతో కాంటాక్ట్ కావాలని కోరారు. ఈ సంక్షోభాన్ని చల్లార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి రష్యా భీకరంగా దురాక్రమించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందని వివరించారు. ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ డ్రోమ్‌లు, మిలిటరీ ఎయిర్‌పోర్టులు, మిలిటరీ వ్యవస్థలపై బాంబులు, క్షిపణులతో దాడి చేశారని తాము ధ్రువీకరించినట్టు తెలిపారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఉక్రెయిన్ వైమానిక సహా పలు మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడి చేయడం వెనుక ప్రధాన కారణం నాటో కూటమి కనిపిస్తున్నది. ఈ దాడికి పూర్వం గతేడాది డిసెంబర్‌లోనే రష్యా పశ్చిమ దేశాలకు తమ డిమాండ్లు పంపింది. నాటో కూటమిలోకి ఉక్రెయిన్ దేశాన్ని ఎప్పటికీ చేర్చుకోబోమన్న హామీ ఇవ్వాలని, అలాగే, తూర్పు ఐరోపా వైపు నాటో విస్తరణ ఆపేయాలని రష్యా డిమాండ్ చేసింది. 1997 మిలిటరీ స్టేటస్‌ను మాత్రమే నాటో గుర్తించుకోవాలని పుతిన్ కోరారు. అంటే.. ఆ తర్వాత నాటో నిర్మించుకున్న మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రద్దు చేసుకోవాలని. వీటితోపాటు మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఈ ప్రధాన డిమాండ్లను పశ్చిమ దేశాలు తిరస్కరించినట్టుగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించింది.
1991 డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ కుప్పకూలింది. దీంతో ఆ యూనియన్ 15 దేశాలుగా అర్మేనియా, అజర్‌బైజన్, బెలారస్, ఎస్టోనియా, జార్జియా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, లాట్వియా, లిథువేనియా, మోల్డోవా, రష్యా, తజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్‌లుగా విడిపోయాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత అమెరికా మాత్రమే ప్రపంచంలో సూపర్ పవర్‌గా మిగిలింది. అమెరికా సారథ్యంలో నాటో వేగంగా విస్తరించింది. సోవియట్ యూనియన్ శిబిరంలో గతంలో ఉన్న దేశాలు కూడా మెల్లగా నాటోలో చేరడం మొదలయ్యాయి. ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలూ 2004లో నాటో కూటమిలో చేరాయి. జార్జియా, ఉక్రెయిన్‌లకూ నాటో సభ్యత్వ ఆఫర్ 2008లో వచ్చింది. కానీ, అవి ఇంకా చేరలేదు.
నాటో విస్తరణను పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఇప్పుడు మా ఇంటి ముందు క్షిపణులతో నిలబడి ఉన్నదని ఆయన 2021 డిసెంబర్‌లో పేర్కొన్నారు. ఒక వేళ కెనడా, మెక్సికో సరిహద్దుల్లో తాము క్షిపణులతో మోహరించి ఉంటే అమెరికాకు ఎలా అనిపిస్తుంది? అంటూ సూటి ప్రశ్న వేశారు. ఒక వేళ ఉక్రెయిన్ కూడా నాటో కూటమిలో చేరితే.. రష్యా దేశాన్ని నాటో కూటమి చుట్టేసినట్టుగానే ఉంటుంది.