
Fact Check: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికపై ఇష్టానుసారంగా, ఎలాంటి ఆధారాలు లేని వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ఏ వార్త నిజమో, ఏది తప్పు అనేది గుర్తించటం చాలా కష్టంగా మారింది. తాజాగా ఈ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు జైలు శిక్ష అని అసత్య ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారానికి చెక్ పెడుతు పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏంటీ? అసలేం జరిగింది?
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందనీ, వారిని జైలుకు పంపిస్తారనే ఆరోపణలతో ఒక యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించింది. ఆ ఛానలే “a.sharmaexpress” అనే యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ తన వీడియోలో, కంటెంట్ లో సెన్సేషనల్ హెడ్‌లైన్‌తో కేంద్ర నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తోంది.
ఈ సారి ఏకంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు టార్గెట్ చేస్తూ.. వారిపై FIR నమోదు చేయబడిందనీ, వారిని త్వరలో అదుపులోకి తీసి జైలు శిక్ష అమలు చేయబోతున్నారంటూ వీడియోలను పోస్టు చేశారు. ఇదే ఛానల్ “Abisar Express” పేరుతో కూడా ఫేక్ న్యూస్ ను ప్రసారం చేస్తుంది.
ఇంకా, ఈ ఛానల్ వీడియోలో బాంబే హైకోర్టులో ప్రధాని మోదీ వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైందనీ, పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయబోతున్నారనీ, తద్వారా ఆయన పదవిలోనుండి తప్పించబోతున్నారని ఇష్టానూసారంగా వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ అభిసార్ శర్మ తెలిపినట్లుగా 2020లో మహారాష్ట్రలో సంగోలా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ, ఇద్దరు ఇతర కేంద్ర మంత్రులతో కలిసి 100వ కిసాన్ రైలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎన్నికల నియమావళి (Model Code of Conduct) ను ఉల్లంఘించారని ఆరోపించారు.
అంతేకాదు, జస్టిస్ బి.ఆర్. గవాయ్ (CJI) ప్రధాని మోదీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మరో వీడియోలో అభిసార్ శర్మ ఆరోపించారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
PIB క్లారిటీ
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వార్తలను పూర్తిగా అవాస్తవమని ఖండించింది. ప్రజలను మోసగించే, అసత్య సమాచారాన్ని ప్రచారం చేయొద్దని PIB హెచ్చరించింది. అవి తప్పుడు కథనాలని చేసింది. ఇలా చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.
ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలపై ఎలాంటి కేసులు, న్యాయపరమైన ఆదేశాలు లేదా చర్యలు ఏవీ చోటుచేసుకోలేదని PIB మరోసారి వెల్లడించింది. ప్రజలు ఎట్టి పరిస్థితిల్లో ఇలాంటి వదంతులను నమ్మకుండా జాగ్రతగా ఉండాలని PIB సూచిస్తోంది. మోదీ, అమిత్ షా జైలుకు పంపిస్తారని వున్న వార్తలు పూర్తిగా అబద్దాలేనని PIB స్పష్టం చేసింది.