
బీహార్‌లో ఓటర్ల జాబితా మార్పులపై నిరసనగా, విపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనం వద్ద నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం దిశగా ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ముందుండగా, అనేక విపక్ష నేతలు ఏకతాటిపైకి వచ్చారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దొంగలించారని ఆరోపిస్తూ, ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంలో, ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ, బీహార్ ఓటర్ లిస్టులో జరిగిన మార్పులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, సపా అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఇండియా బ్లాక్ లోని పలువురు కీలక నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. 300 మందికి పైగా ఎంపీలు ఒకే వేదికపైకి రావడం విశేషం.
ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం తెలిపారు. పార్లమెంట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. మహిళా ఎంపీలు బారికేడ్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేయగా, పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.
ఎన్నికల సంఘం నుంచి 30 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని జైరాం రమేష్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. అయితే రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్షం, అందరికీ అనుమతి ఇవ్వాలని పట్టుబడింది. ఓట్ల చోరీపై తమ సవాల్‌ను ఈసీ ముందు ఉంచుతామని వారు స్పష్టం చేశారు.