
బిహార్‌లో ఓటర్ల సమగ్ర సవరణ (SIR)పై విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా దాదాపు 300 మంది విపక్ష ఎంపీలు పార్లమెంట్ నుండి భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించారు. అయితే.. ఈ ర్యాలీకి ముందస్తుగా అనుమతి ఇవ్వకపోవడంతో, పోలీసులు మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరోధించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయగా, కొంతమంది ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసనలు ప్రకటించారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ వంటి సీనియర్ ఇండియన్ బ్లాక్ ఎంపీలను ఢిల్లీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ఈ పోరాటం రాజకీయ లక్ష్యాలకు కాదు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు. మనకు అసలైన ఓటర్ల జాబితా కావాలి” అని డిమాండ్ చేశారు. ఆయన బీహార్‌లో జరిగిన ఓట్ల జాబితా సవరణలో అనేక అస్థిరతలు ఉన్నట్టు, దేశానికి ఇది గంభీర సమస్యగా ఉందని హెచ్చరించారు. ఇది వరుసగా ఈసీకి విపక్షాల ప్రతిపాదనలపై చర్చలకు దారితీస్తుందని భావిస్తున్నారు. కాగా, ఈసీ ఇప్పటికే 30 మంది విపక్ష ఎంపీలతో సమావేశం ఏర్పాటుచేసి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది.