
విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. లోక్‌సభలో ఆయన గురువారం ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌కు అంతర్జాతీయ ఆర్ధిక విధానం తెలియదని, ఆ పార్టీకి ఎలాంటి విజన్ లేదన్నారు. కాంగ్రెస్‌కు నిజాయితీ లేదని.. ఆ పార్టీ హయాంలో భారత్ పేదరికంలో మగ్గిపోయిందని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028లోనూ విపక్షాలు మాపై అవిశ్వాస తీర్మానం పెడతాయని, విపక్షాలకు పాకిస్తాన్‌పై ప్రేమ కనిపిస్తోందని ఆయన చురకలంటించారు. పాక్ చెప్పిందే విపక్షాలు నమ్ముతున్నాయని.. పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సైన్యాన్ని కాంగ్రెస్ నమ్మలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తయారైనా .. భారత్ వ్యాక్సిన్‌పై విపక్షాలకు నమ్మకం లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా అంటే ఎగతాళి చేశారని ఫైర్ అయ్యారు. 2028 నాటికి భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానంలో వుంటుందన్నారు. కశ్మీర్‌పై, కశ్మీర్ పౌరులపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదని మోడీ ఫైర్ అయ్యారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని.. కాంగ్రెస్‌కు అహంకారంతో కళ్లు మూసుకుపోయాయని ధ్వజమెత్తారు.
ALso Read: అవిశ్వాసం మాకు అదృష్టం.. 2018లోనూ ఇంతే, 2019లో ఏమైంది : విపక్షాలకు మోడీ కౌంటర్
త్రిపురలో 1988లో చివరిసారి కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని.. యూపీ, బీహార్‌లోనూ కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని మోడీ ఎద్దేవా చేశారు. నాగాలాండ్‌లో 1988లో చివరిసారిగా కాంగ్రెస్ గెలిచిందని.. తమిళనాడులో 1962లో చివరిసారిగా గెలిచిందని ప్రధాని చురకలంటించారు. కాంగ్రెస్‌పై అన్ని రాష్ట్రాల ప్రజలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించారని మోడీ సెటైర్లు వేశారు. విపక్షాలు ఇండియాను I.N.D.I.Aగా ముక్కలు చేశాయన్నారు.
NDAలో రెండు ‘‘ I ’’లు చేర్చారని .. మొదటి I అంటే 26 పార్టీల అహంకారమని, రెండవ I అంటే ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతీ పథకం పేరు వెనుక కాంగ్రెస్ ఒక కుటుంబం పేరు చేర్చిందని ఎద్దేవా చేశారు. కానీ అక్కడ స్కీమ్‌లు లేవని, అన్నీ స్కామ్‌లేనని మోడీ దుయ్యబట్టారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారని ప్రధాని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అది ఘమండియా కూటమిగా మోడీ అభివర్ణించారు.