
అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. అవిశ్వాస తీర్మానంపై గురువారం ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. అవిశ్వాసం పెట్టాలని దేవుడే విపక్షాలకు చెప్పాడంటూ మోడీ సెటైర్లు వేశారు. గడిచిన మూడు రోజులుగా చాలా మంది మాట్లాడారని.. 2018లోనూ అవిశ్వాసం పెట్టారని ఆయన గుర్తుచేశారు. కానీ విపక్షాలకు ఎంతమంది సభ్యులున్నారో అన్ని ఓట్లు కూడా రాలేదని మోడీ సెటైర్లు వేశారు. అవిశ్వాసం తమపై కాదని.. విపక్షాలపైనే అని ప్రధాని అన్నారు. 2024లో ఎన్డీఏ కూటమి అన్ని రికార్డులను బద్ధలు కొడుతుందని.. విపక్షాల అవిశ్వాసం తమకు శుభదాయకమన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని.. విపక్షాలకు అధికార దాహం పెరిగిందని ప్రధాని చురకలంటించారు.
పేదల భవిష్యత్ కంటే విపక్షాలకు అధికారమే ముఖ్యమని.. ఐదేళ్ల కాలంలో ప్రజల విశ్వాసం చూరగొనడంలో విపక్షాలు విఫలమయ్యాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఐదేళ్లు టైం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదని.. అవిశ్వాసంపై జరిగిన చర్చ ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఫిల్డింగ్ విపక్షాలు చేస్తుంటే.. ఫోర్లు, సిక్సులు తమవైపు నుంచి పడ్డాయని ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. నో కాన్ఫిడెన్స్ నో బాల్‌గానే మిగిలిపోయిందని.. అధీర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదో అర్ధం కాలేదన్నారు. కోల్‌కతా నుంచి ఫోన్ వచ్చిందేమోనంటూ మోడీ సెటైర్లు వేశారు.
చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాట దేశం మొత్తం విన్నదని ఆయన పేర్కొన్నారు. మా పాలన స్కామ్ ఫ్రీ భారత్‌ను అందించిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయని.. దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు వ్యాపింపజేశామని మోడీ చెప్పారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఎంత బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనమని.. ప్రపంచం నలుమూలలా భారత్‌కు విస్తారంగా అవకాశాలు వస్తున్నాయన్నారు. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించిందని.. అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో జీర్ణించుకుపోయాయని మోడీ దుయ్యబట్టారు.
స్కామ్‌లు లేని పాలనను భారత్‌కు అందించామని.. విపక్షాల వెనుక రహస్య శక్తులున్నాయని మోడీ ఆరోపించారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోందని.. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అసత్య ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. హెచ్ఏఎల్ దివాళా తీస్తుందని దుష్ప్రచారం చేశారని .. కానీ హెచ్ఏఎల్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ప్రధాని చెప్పారు. హెచ్ఏఎల్ అత్యధిక రెవెన్యూ ఆర్జించిందని మోడీ తెలిపారు. మూడు రోజులుగా విపక్షాలు డిక్షనరీలన్నీ తిరగేశాయని.. అనరాని మాటలు అనడంతో విపక్షాల మనస్సులు శాంతించి వుంటాయని మోడీ చురకలంటించారు.
భారత్‌లో జరిగే మంచిని చూసి విపక్షాలు సహించలేకపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఎల్ఐసీ నాశనమవుతుందని, దివాళా తీస్తుందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణలో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎల్ఐసీ ఎంతో పటిష్టంగా వుందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటుందని ప్రధాని ఆకాంక్షించారు.