వాటర్ బాటిల్ కొనుగోలుపై గొడవ.. ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి ప్యాసింజర్‌ను తోసేసిన ప్యాంట్రీ

By Mahesh KFirst Published Aug 8, 2022, 4:16 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో నడుస్తున్న ట్రైన్ నుంచి ఓ ప్రయాణికుడిని కిందకు తోసేశారు. వాటర్ బాటిల్ కొనుగోలు, పాన్ మసాలా నమిలి ఉమ్మివేయడంపై సదరు ప్రయాణికుడికి, ప్యాంట్రీ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ప్యాంట్రీ సిబ్బంది.. ఆ ప్రయాణికుడిని కిందకు తోసేశారు.
 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నడుస్తున్న ట్రైన్ నుంచి ఓ ప్రయాణికుడిని బయటకు తోసేశారు. కేవలం ఓ వాటర్ బాటిల్ కొనుగోలు విషయంపై గొడవనే ఇందుకకు కారణంగా తెలుస్తున్నది. ట్రాక్ పై గాయాలతో పడి వున్న ఓ వ్యక్తిని స్థానికులు హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్ పుర్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు ఝాన్సీ పోలీసులు వెల్లడించారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, 26 ఏళ్ల రవి యాదవ్, తన సోదరితో కలిసి ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ (12591)లో శనివారం ప్రయాణిస్తుండగా ఓ చిన్న గొడవ జరిగింది. ఆ ట్రైన్ జిరోలి గ్రామానికి చేరుకున్న సమయంలో రవి యాదవ్‌కు ఓ ప్యాంటీ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలుపై, పాన్ మసాలా నమిలి ఉమ్మి వేయడంపై వీరికి మధ్య మాటా మాటా పెరిగినట్టు పోలీసులు తెలిపారు.

ఈ గొడవ పెద్దది అవుతుండగా.. ట్రైన్ లలిత్ పుర్ చేరుకుంది. ఆ స్టేషన్‌లో రవి యాదవ్ సోదరి దిగింది. కానీ, రవి యాదవ్ స్టేషన్‌లో దిగకుండా ప్యాంట్రీ స్టాఫ్ అడ్డుకుంది. ఆ తర్వాత ట్రైన్ మూవ్ అయ్యాక రవి యాదవ్‌పై దాడి చేశారు. దాడి చేసిన తర్వాత రవి యాదవ్ ను నడుస్తున్న ట్రైన్ నుంచే బయటకు తోసేశారు. ట్రాక్ పై పడి ఉన్న రవి యాదవ్ ను స్థానికులు వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆయనను తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిసింది.

రవి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్యాంట్రీ స్టాఫ్‌పై సెక్షన్లు 323, 325, 506 కింద కేసులు నమోదు చేసినట్టు గవర్నమెంట్ రైల్వే పోలీసు సర్కిల్ ఆఫీసర్ మొహమ్మద్ నయీమ్ తెలిపారు. ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడు అమిత్‌ను రవి యాదవ్ గుర్తు పట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతున్నదని అధికారి తెలిపారు.

click me!