హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో Cloudburst.. ఒక‌రు మృతి.. ధ్వంస‌మైన ఇండ్లు

By Mahesh RajamoniFirst Published Aug 8, 2022, 3:54 PM IST
Highlights

Himachal Pradesh: క్లౌడ్‌బర్స్ట్ (Cloudburst ) కార‌ణంగా భడోగా వద్ద విజయ్ కుమార్ (15) మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. కంద్వారా వద్ద, షాలే కంద్వారా నుల్లాపై ఉన్న PWD వంతెన, వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
 

Chamba Cloudburst: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో రెండు గ్రామాలపై Cloudburst  (కుండ‌పోత వ‌ర్షం/ మేఘ విస్ఫోటనం) విరుచుకుప‌డింది. దీంతో ఓ 15 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, కొన్ని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఆదివారం-సోమవారం మధ్య రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు భడోగా, కంద్వారా గ్రామాలు దెబ్బతిన్నాయని చంబా జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (DEOC) తెలిపింది. భడోగా వద్ద విజయ్ కుమార్ (15) మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. కంద్వారా వద్ద, షాలే కంద్వారా నుల్లాపై ఉన్న పిడబ్ల్యూడీ వంతెన, వ్యవసాయ భూమి దెబ్బతిన్నాయని వారు తెలిపారు. మరోవైపు వ‌ర‌ద‌ నీరు పొంగిపొర్లడంతో పక్కనే ఉన్న గులేల్ గ్రామంలోని ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలావుండ‌గా,  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పూణే, పశ్చిమ మహారాష్ట్రలోని రాయగఢ్, రత్నగిరి, సతారా సహా కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్  ప్ర‌క‌టించింది. రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులలో తూర్పు భారత తీరంలో గాలులు వీస్తాయ‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలోనే IMD ఒడిశా, తెలంగాణల‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో కూడా వాన‌లు ప‌డుతున్నాయి. భారీ వ‌ర్షం నేప‌థ్యంలో యమునా నీటి మట్టం పెరుగుతున్న త‌రుణంలో అధికారులు ముందస్తు జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు.  ఈశాన్య ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ వరద పీడిత ప్రాంతాల చుట్టూ 24 గంటలూ పోలీసుల మోహరింపును పెంచాలని ఢిల్లీ పోలీసులను కోరారు. అన్ని జిల్లాలు కూడా జిల్లాల వారీగా విపత్తు నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేసి, తరలింపు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంఘటనలను నివారించడానికి  చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

అలాగే, మహారాష్ట్రలోని సింధుదుర్గ్, దక్షిణ కొంకణ్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రెండు వారాల విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు మళ్లీ మహారాష్ట్రలో చురుగ్గా మారాయని, ఈసారి దక్షిణ కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలిపింది. IMD డేటా ప్రకారం సోమవారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు, ప్రధానంగా సింధుదుర్గ్, రత్నగిరిలోని కొన్ని ప్రాంతాలలో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సింధుదుర్గ్, రత్నగిరిలోని అనేక గ్రామాలను వ‌ర‌ద నీరు ముంచెత్తింది. అలాగే, గ్రామాల‌ను క‌లిపే రహదారులు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. రెండు జిల్లాల్లోని అనేక నదులు ఉప్పొంగి వ్యవసాయ పొలాల్లోకి నీరు చేరి ఇళ్లలోకి కూడా వ‌ర‌ద నీరు వ‌స్తున్న‌ద‌ని తెలిపారు. "సింధుదుర్గ్ జిల్లాలోని కొన్ని తహసీల్‌లలో గత 24 గంటల్లో 250 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో లాంజాలో 290 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం" అని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

అల్పపీడనం కారణంగా ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఒడిశా, పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లో వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయ‌ని తెలిపింది. మత్స్యకారులు గురువారం ఉదయం వరకు తీరం వైపు వెళ్లవద్దని సూచించారు. ఖుర్దా, పూరీ, రాయగడ, కలహండి, గజపతి, గంజాం, నయాగఢ్, కంధమాల్, నబరంగ్‌పూర్, మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో సోమవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు 'ఆరెంజ్ వార్నింగ్' జారీ చేశారు.

click me!