జమిలి ఎన్నికలతో ప్రజలకు ప్రయోజనం.. రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు

By Sumanth Kanukula  |  First Published Nov 21, 2023, 12:34 PM IST

దేశంలో ‘‘ఒకే దేశం..ఒకే ఎన్నికలు’’ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.


దేశంలో ‘‘ఒకే దేశం..ఒకే ఎన్నికలు’’ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను రామ్‌నాథ్ కోవింద్ కోరారు. ప్రజలు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉన్నవారికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు.

సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన మీడియా సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ.. ‘‘ఒక దేశం, ఒకే ఎన్నికలు అమలు చేస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ‌కే మేలు జరుగుతుంది. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు లేదా మరే ఇతర రాజకీయ పార్టీ అయినా కావచ్చు.. అందులో ఎటువంటి వివక్ష లేదు.  ప్రజలు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒకేసారి ఎన్నికల ద్వారా డబ్బు ఆదా చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగించవచ్చు’’ అని పేర్కొన్నారు. 

Latest Videos

undefined

‘‘ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్‌గా నియమించింది. కమిటీ సభ్యులు, ప్రజలతో కలిసి ఈ సంప్రదాయాన్ని తిరిగి అమలు చేయడంపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తారు’’ అని కోవింద్ అన్నారు. ఇక, 1952లో స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి 1967 వరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ లోక్‌సభ, కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు పదవీకాలం ముగియకముందే రద్దు చేయబడటం వంటి కారణాలతో.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరిగాయి.

‘‘ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సమయంలో మద్దతు ఇచ్చింది. బహుశా కొందరు దీనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ దేశానికి ప్రయోజనకరంగా ఉన్నందున నిర్మాణాత్మక మద్దతు కోసం మేము అన్ని పార్టీలను అభ్యర్థిస్తున్నాము. ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలతో ముడిపడింది కాదు’’ అని కోవింద్ పేర్కొన్నారు. 

ఇక, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని న్యాయ మంత్రిత్వ శాఖ లా కమిషన్‌ను కోరగా.. కోవింద్ నేతృత్వంలోని కమిటీ లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తుంది.
 

click me!