Lok Sabha Security Breach : దుండగులకు పాస్‌లు జారీ చేసింది ఈయనే .. స్పీకర్‌ని కలిసి వివరణ, ఏం చెప్పారంటే

By Siva Kodati  |  First Published Dec 13, 2023, 10:15 PM IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ బుధవారం లోక్‌సభలో దుండగులు దూసుకొచ్చిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో నలుగురి పాత్ర ఉన్నప్పటికీ , మొత్తం ఆరుగురు ప్రమేయం వున్నట్లు గుర్తించారు. నిందితులు లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లేందుకు అవసరమైన పాసులు మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా కార్యాలయం నుంచి జారీ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ బుధవారం లోక్‌సభలో దుండగులు దూసుకొచ్చిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో నలుగురి పాత్ర ఉన్నప్పటికీ , మొత్తం ఆరుగురు ప్రమేయం వున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే ఈ ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఈ ఘటనపై వీరు రెక్కీ నిర్వహించారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. నిందితులను సాగర్ శర్మ, మనో రంజన్ డీ, అమోల్ శిందే, నీలమ్‌, లలిత్, విక్రమ్‌లుగా గుర్తించారు. వీరిలో లలిత్ పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా.. నిందితులు లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లేందుకు అవసరమైన పాసులు మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా కార్యాలయం నుంచి జారీ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు సైతం ప్రతాప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి. ఇదే సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతాప్ సింహా కలిసి వివరణ ఇచ్చినట్లుగా జాతీయ వార్తా సంస్థ ఇండియా టుడే కథనాన్ని ప్రచురించింది.

Latest Videos

నిందితుల్లో ఒకరైన సాగర్ శర్మ తండ్రి తన నియోజకవర్గానికి చెందినవారేపనని, కొత్త పార్లమెంట్ భవనాన్ని చూసేందుకు పాస్ కావాలని కోరడంతోనే అతనికి మంజూరు చేసినట్లు ప్రతాప్ స్పీకర్‌కు తెలిపినట్లుగా ఇండియా టుడే నివేదించింది. సాగర్ శర్మ.. పార్లమెంట్‌ను సందర్శించేందుకు అవసరమైన పాస్‌లు పొందేందుకు తన వ్యక్తిగత సహాయకుడుతో, తన కార్యాలయంతో నిరంతరం టచ్‌లో వున్నారని ప్రతాప్ .. స్పీకర్‌కు తెలిపినట్లుగా తెలుస్తోంది. అంతకుమించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని ప్రతాప్ అన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

కాగా.. ప్రతాప్ సింహా పేరుతో జారీ చేసిన విజిటర్ పాస్ ద్వారానే సాగర్ శర్మ లోక్‌సభలో ప్రవేశించినట్లుగా తేలడంతో మైసూరులోని ఆయన కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అటు ప్రధాని నరేంద్ర మోడీపైనా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పాస్ మీద పార్లమెంట్‌లో చొరబాటు అంటూ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. 

పార్లమెంట్ విజిటర్ పాస్ ఎలా జారీ చేస్తారు :

ఎవరైనా పార్లమెంటును సందర్శించాలనుకునే వారు ముందుగా తమ నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుని పేరు మీద దరఖాస్తు చేసుకోవాలి. ఎంపీలు ఎవరి పేర్లతో పాస్‌ను జారీ చేస్తారో వారిని అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాతే భద్రతా సిబ్బంది లోపలికి అనుమతిస్తారు. పార్లమెంట్ ఎంట్రీ గేట్ వద్ద మోహరించిన గార్డులు .. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా తనిఖీ చేస్తారు. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత, నాలుగంచెల రక్షణ వలయాన్ని దాటుకుని  స్మోక్ డబ్బాలతో దుండగులు లోక్‌సభలోకి ఎలా ప్రవేశించగలిగారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

click me!