లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా..

By Sumanth KanukulaFirst Published Feb 7, 2023, 12:30 PM IST
Highlights

గత మూడు రోజులుగా అదానీ గ్రూప్‌పై మోసం ఆరోపణలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పలు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పార్లమెంటు కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. 

పార్లమెంట్‌ ఉభయసభలలో విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అదానీ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. దీంతో పార్లమెంట్ ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. మంగళవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే.. ఉభయ  సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం ఉభయ సభలు ప్రారంభం కాగా.. రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెల్ వద్దకు వెళ్లి అదానీ అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

మరోవైపు లోక్‌సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చను చేపట్టారు. బీజేపీ ఎంపీ సీపీ జోషి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను జోషి ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. గత మూడు రోజులుగా అదానీ గ్రూప్‌పై మోసం ఆరోపణలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పలు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పార్లమెంటు కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. అయితే అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూనే ఉండాలని నిర్ణయించినట్టుగా పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో విపక్ష పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అదానీ అంశంపై చర్చ లేకుండా పార్లమెంట్‌లో చర్చలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నో చెప్పాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

click me!