హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణం.. నియామకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం

By Sumanth KanukulaFirst Published Feb 7, 2023, 11:57 AM IST
Highlights

మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. గౌరీ చేత మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి టీ రాజా ప్రమాణం చేయించారు.

మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. గౌరీ చేత మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి టీ రాజా ప్రమాణం చేయించారు. గౌరీతో పాటు మరో నలుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు  విక్టోరియా గౌరీని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం చేసిన సిఫార్సును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాము రిట్ పిటిషన్‌ను స్వీకరించడం లేదని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. 

అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియమాకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులోని ముగ్గురు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే వీరి పిటిషన్‌ను సోమవారం రోజున సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్  నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 10న విచారణకు పెట్టింది. అయితే ఆమె నియామకాన్ని కేంద్రం నోటిఫై చేసిందని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ మరోసారి ప్రస్తావించడంతో దానిని ఫిబ్రవరి 7న విచారణకు ఉంచారు. 

పిటిషన్ దాఖలు చేసిన లాయర్లు.. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా గౌరీ ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర ముప్పు వాటిల్లిన దృష్ట్యా  హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయకుండా నిషేధిస్తూ తగిన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇక, ఈ రోజు ఉదయం 10.35 గంటలకు గౌరీ ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో ఆమె నియామకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల సుప్రీంకోర్టు ముందస్తుగా విచారణకు సిద్దమైంది. న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ఉదయం 10.25 గంటలకు సమావేశమైంది.

click me!