రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం.. పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా..

Published : Mar 14, 2023, 03:11 PM IST
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం..  పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా..

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన లండన్ పర్యటనలో భారత్‌లో ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఉభయసభల్లో దుమారం రేపుతున్నాయి.

పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. లండన్ పర్యటనలో భారత్‌లో ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఉభయసభల్లో దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. అదానీ వ్యవహారం జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. మంగళవారం ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా.. సభను నిర్వహించడానికి సహకరించాలని సభ్యులను కోరారు. 

లోక్‌సభ సమావేశమైన వెంటనే బీజేపీ సభ్యులు రాహుల్ గాంధీ క్షమాపణలు కోరుతూ నినాదాలు చేయగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల సందర్భంగా చేసిన ప్రసంగాలలోని వ్యాఖ్యాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు సిద్దమయ్యారు. అయితే కాంగ్రెస్‌తో పాటు పలు విపక్ష పార్టీల సభ్యులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభ్యులను ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ ఓం బిర్లా కోరారు. ‘‘ప్రశ్నోత్తరాల  సమయం తర్వాత సమస్యలను లేవనెత్తడానికి నేను అవకాశం ఇస్తాను. ప్రశ్నోత్తరాల సమయం పార్లమెంటరీ కార్యక్రమాలలో ముఖ్యమైన భాగం. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత నేను మీకు తగిన అవకాశాలను ఇస్తాను. మీ స్థానాలకు తిరిగి రావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నిబంధనల ప్రకారం ప్రతి అంశాన్ని నేను అనుమతిస్తాను’’ అని బిర్లా చెప్పారు.

అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితులు కొనసాగాయి. గందరగోళం మధ్యే పేపర్లు, స్టాండింగ్ కమిటీ నివేదికలు సమర్పించబడ్డాయి. ఆ తర్వాత 10 నిమిషాల లోపే స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి(బుధవారం) వాయిదా వేశారు. 

రాజ్యసభ విషయానికి వస్తే.. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న ఆర్‌ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పర్స్‌ చిత్ర బృందాలకు అభినందనలు వెల్లువెత్తాయి. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ‘‘నాటు నాటు’’ పాట,  ‘‘ది ఎలిఫెంట్ విస్పర్స్’’ షార్ట్ ఫిల్మ్స్ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌తో పాటు పార్టీలకు అతీతంగా రాజ్యసభ సభ్యులు ఆ రెండు బృందాలకు అభినందనలు తెలియజేశారు. 

ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్న ప్రభుత్వ డిమాండ్‌పై ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి రాజ్యసభ ప్రారంభమైన తర్వాత.. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు. 

‘‘మేము పరిస్థితిని పరిశీలించాము. రాజ్యాంగ నిబంధనలు, మనం రూపొందించుకున్న నియమాలు, మునుపటి చైర్మన్లు అందించిన ఆదేశాలు’’ అని జగదీప్ ధన్‌కర్ చెప్పారు. లోక్‌సభలో ఇచ్చిన ఆదేశాలను కూడా పరిశీలించామని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ ఫ్లోర్ లీడర్‌లను కలవనున్నట్టుగా చెప్పారు. ఈ అంశంపై తన తీర్పును త్వరగా పొందుతారని భావిస్తున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. 
 

PREV
click me!

Recommended Stories

Pongal: నిజ‌మైన సంక్రాంతి అంటే వీళ్ల‌దే.. ప్ర‌భుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 13 వేలు సాయం
Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !